
ఇటీవలికాలంలో ఆస్ట్రేలియా టీ20 ఆటగాడు టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. పట్టపగ్గాల్లేకుండా సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట వెస్టిండీస్‌పై 37 బంతుల్లో శతక్కొట్టిన ఈ మెరుపు వీరుడు.. ఆతర్వాత సౌతాఫ్రికాపై వరుస అర్ద సెంచరీలతో (52 బంతుల్లో 83, 24 బంతుల్లో 50) విరుచుకుపడ్డాడు.
టిమ్ ఇదే విధ్వంసాన్ని ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లోనూ కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వచ్చిన టిమ్.. తొలి మ్యాచ్‌లోనే మెరుపు ప్రదర్శన చేశాడు. ఈ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌కు ఆడుతున్న అతను.. ఇవాళ (ఆగస్ట్ 20) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 5 సిక్సర్లు, బౌండరీ సాయంతో 4 పరుగులు చేశాడు.
టిమ్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో లూసియా కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (200/8) చేసింది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో టిమ్‌కు ముందు జాన్సన్ ఛార్లెస్ (28 బంతుల్లో 52), రోస్టన్ ఛేజ్ (38 బంతుల్లో 61) మెరుపు అర్ద శతకాలు బాదారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్‌ను నేవియన్ బిదైసీ (50), జేసన్ హోల్డర్ (29 బంతుల్లో 63; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) గెలిపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడినా పేట్రియాట్స్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
హోల్డర్ ఊహకందని షాట్లతో విరుచుకుపడినా పేట్రయాట్స్‌ను గెలిపించలేకపోయాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్ వృధా అయ్యింది. పేట్రియాట్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులే చేయగలిగింది. మెరుపు అర్ద శతకంతో పాటు రెండు వికెట్లు తీసిన లూసియా కింగ్స్ ఆటగాడు రోస్టన్ ఛేజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.