
విమర్శకుల నోళ్లు మూయించడం ఆనందంగా ఉంది: ఆర్చర్
లండన్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ క్రమంలో ఆర్చర్ విమర్శకులను ఉద్దేశించి ‘కీబోర్డ్ వారియర్స్’ అనే పదాన్ని ఉపయోగించాడు. 2021లో చివరిసారి ఇంగ్లండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన ఆర్చర్... టీమిండియాతో జరిగిన లార్డ్స్ టెస్టుతో పునరాగమనం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించిన ఆర్చర్... రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
‘ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇన్నాళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి విజయంలో భాగమవడం సంతోషంగా ఉంది. గత మూడు నాలుగేళ్లుగా ఎంతమంది ‘కీబోర్డ్ వారియర్స్’ నన్ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారో లెక్కచెప్పలేను. ఎన్నో గాయాలు, మరెన్నో పునరావాస శిబిరాల తర్వాత వచ్చిన ఈ గెలుపు చాలా ప్రత్యేకం’ అని ఆర్చర్ అన్నాడు. మోచేయి, వెన్నునొప్పి, కండరాలు ఇలా ఎన్నో గాయాల బారిన పడిన 30 ఏళ్ల ఆర్చర్... గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.
ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకోవడంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో తిరిగి అడుగు పెట్టాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు పంత్, వాషింగ్టన్ సుందర్‌ను ఆర్చర్ పెవిలియన్‌కు పంపాడు. పంత్ వికెట్‌తో జట్టులో నూతనోత్సాహం వచ్చిందని ఆర్చర్ వెల్లడించాడు. ‘ఇన్నాళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశా. ఇది శుభసూచకం. పంత్ వికెట్‌తో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మరింత పట్టుబిగించగలిగాం’ అని ఆర్చర్ అన్నాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్ల మధ్య ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో నాలుగో మ్యాచ్ ప్రారంభం కానుంది.