
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను భారీ షాక్‌కు గురి చేశాయి. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు.. వారం తిరిగేలోపే ర్యాంకింగ్స్ నుంచి పూర్తిగా మాయమైపోయారు. ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్, కోహ్లి పేర్లు కనిపించలేదు. ఇది చూసి రోహిత్, కోహ్లితో పాటు వారి అభిమానులు కూడా షాక్‌కు గురవుతున్నారు.
ఇంత సడెన్‌గా తమ ఆరాధ్య ఆటగాళ్ల పేర్లు ఎలా మాయమైపోయాయని ఆశ్చర్యపోతున్నారు. ఇలా జరగడంలో ఐసీసీ తప్పిదమేమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. కొందరేమో రోహిత్, కోహ్లి టీ20, టెస్ట్ తరహాలో వన్డే రిటైర్మెంట్ కూడా సడెన్‌గా ప్లాన్ చేశారేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ రూల్స్ ఇలా..!
ఐసీసీ ర్యాంకింగ్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు 9-12 నెలల కాలంలో సంబంధింత ఫార్మాట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. అయితే తాజా ఉదంతంలో రోహిత్, కోహ్లి విషయంలో అలా జరగలేదు. వీరిద్దరు మార్చి 9న, అంటే ఐదు నెలల కిందట ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. ఈ లెక్కన రోహిత్, కోహ్లి పేర్లు సడెన్‌గా వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించడానికి వీల్లేదు.
మరి ఏం జరిగి ఉంటుంది..?
రోహిత్, కోహ్లి పేర్లు వన్డే ర్యాంకింగ్స్ నుంచి ఆకస్మికంగా తొలగించడం వెనుక ఏదైనా కుట్ర (బీసీసీఐ) దాగి ఉందా అని వారి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఈ ఫార్మాట్‌లో కొనసాగుతామని పరోక్షంగా చెప్పారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ సానుకూలంగా లేదని తెలుస్తుంది.
రోహిత్, కోహ్లి రెండు ఫార్మాట్లలో లేకపోయినా యువ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగా ఉందని వారి భావన. వీరిద్దరు వన్డేల నుంచి తప్పుకున్నా జట్టుపై పెద్ద ప్రభావముండదని వారి అభిప్రాయం.
ఇప్పటి నుంచే వన్డేల్లో రోహిత్, కోహ్లి ప్రత్యామ్నాయాలకు తగినన్ని అవకాశాలిస్తే 2027 వరల్డ్‌కప్ సమయానికి రాటుదేలతారని వారి అంచనా. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీయే రోహిత్, కోహ్లిలను బలవంతంగా వన్డేల నుంచి తప్పుకునేలా చేస్తుందన్న వాదన వినిపిస్తుంది.
ఇందులో భాగంగానే వారి పేర్లను వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించేలా ఐసీసీకి లేఖ రాసి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఇదే జరిగి ఉంటుందని రోహిత్, కోహ్లి అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, వన్డే ర్యాంకింగ్స్ నుంచి రోహిత్, కోహ్లి పేర్లు తొలగింపు తర్వాత కూడా శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా నుంచి శ్రేయస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు.