వన్డే క్రికెట్‌కు సరికొత్త కింగ్ వచ్చాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన 34 ఏళ్ల డారిల్ మిచెల్ (Daryl Mitchell) నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ (119) చేసిన మిచెల్.. రెండు స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. 1979 తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడు మిచెలే.
మిచెల్ అగ్రపీఠాన్ని అధిరోహించే క్రమంలో టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. ఆసీస్ పర్యటనలో సంచలన ప్రదర్శనల (73, 121 నాటౌట్) తర్వాత తొలిసారి నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా అవతరించిన రోహిత్ కేవలం మూడు వారాలు మాత్రమే టాప్ ప్లేస్‌లో కొనసాగాడు. ప్రస్తుతం రోహిత్ ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. మిచెల్‌కు (782) రోహిత్‌కు (781) మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే.
త్వరలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ జరుగనుండగా హిట్‌మ్యాన్ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు మిచెల్ గాయం కారణంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు, మూడు వన్డేలకు దూరమయ్యాడు. ఈ లెక్కన చూస్తే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రోహిత్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేసినా తిరిగి నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం లాంఛనమే.
ఇదిలా ఉంటే, తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్లు శుభ్‌మన్ గిల్ (4), విరాట్ కోహ్లి (5) నిలబెట్టుకున్నారు. టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. టాప్-10లో ఉన్న మిగతా ఆటగాళ్లలో బాబర్ ఆజమ్, హ్యారీ టెక్టార్ తలో స్థానం మెరుగుపర్చుకొని 6, 7 స్థానాలకు ఎగబాకగా.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 3 స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.
మిగతా భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (16), అక్షర్ పటేల్ (89), హార్దిక్ పాండ్యా (92) టాప్-100లో ఉన్నారు. క్వింటన్ డికాక్ 3, మొహమ్మద్ రిజ్వాన్ 5, ఫకర్ జమాన్ 5, డెవాన్ కాన్వే 4, , షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 8, మైఖేల్ బ్రేస్‌వెల్ 4 స్థానాలు మెరుగుపర్చుకున్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, జోఫ్రా ఆర్చర్, కేశవ్ మహారాజ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (6) ఒక్కడే టాప్-10లో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ 11 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, సిరాజ్ వరుసగా 14, 15 స్థానాల్లో నిలిచారు. షమీ 19వ స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు!.. ఓపెనర్లుగా వారే..


