
ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం అందరినీ బాధిస్తుంది. జైస్వాల్‌ను కాదని భారత సెలెక్టర్లు శుభ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపడం కరెక్ట్ కాదని చాలా మంది భావిస్తున్నారు.
ఎందుకంటే, గిల్ అంతర్జాతీయ టీ20 ఆడి ఏడాది దాటిపోయింది. అయినా టెస్ట్ జట్టు కెప్టెన్ అని, ఆ ఫార్మాట్లలో ఇటీవల అద్భుతంగా రాణించాడని అతన్ని ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేశారు. ఇంతటితో ఆగకుండా వైస్ కెప్టెన్‌ను కూడా చేశారు.
జైస్వాల్ పరిస్థితి అది కాదు. ఇతగాడు గత ఏడాది కాలంగా భారత టీ20 ఫార్మాట్‌లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ద సెంచరీలు చేసి రాణించాడు. పైగా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో (10) ఉన్నాడు.
ఆసియా కప్ జట్టులో ఉండేందుకు ఇన్ని అర్హతలు ఉన్నా.. గిల్‌లా బీసీసీఐ పెద్దల అండదండలు లేకపోవడం జైస్వాల్‌కు మైనస్ అయ్యింది. అందుకే అతడికి ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు.
జైస్వాల్ @10.. గిల్ @41
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 10వ స్థానంలో ఉండగా.. చాలాకాలంగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న గిల్ 41వ స్థానంలో కొనసాగుతున్నాడు. జైస్వాల్-గిల్ మధ్య ఈ ర్యాంకింగ్స్ వ్యత్యాసం చూసిన తర్వాత కొందరు భారత అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
టాప్-10లో ఉన్నా ఏం ప్రయోజనం.. టాప్-40లో కూడా లేని ఆటగాడికి అవకాశం దక్కిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ర్యాంకింగ్స్ విషయంలో గిల్‌తో పోలిస్తే జైస్వాల్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. టెస్ట్‌ల్లో, టీ20ల్లో టాప్-10 ఉన్న ఏకైక బ్యాటర్ జైస్వాల్ ఒక్కడే. టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న జైస్వాల్.. టెస్ట్‌ల్లో 5వ స్థానంలో ఉన్నాడు. గిల్ విషయానికొస్తే.. వన్డేల్లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న ఇతగాడు, టెస్ట్‌ల్లో 13వ స్థానంలో ఉన్నాడు.