
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఆటగాడు జోస్ బట్లర్ పొట్టి క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని అధిగమించాడు. టీ20 ఫార్మాట్‌లో జోస్ 13000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ ప్లేయర్‌గా, ఓవరాల్‌గా ఏడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బట్లర్‌కు ముందు ఇంగ్లండ్ తరఫున అలెక్స్ హేల్స్ (503 మ్యాచ్‌ల్లో 13814 పరుగులు) ఈ ఘనత సాధించాడు.
ఓవరాల్‌గా క్రిస్ గేల్ (14562), కీరన్ పోలార్డ్ (13854), అలెక్స్ హేల్స్ (13814), షోయబ్ మాలిక్ (13571), విరాట్ కోహ్లి (13543), డేవిడ్ వార్నర్ (13395), బట్లర్ (13046) మాత్రమే టీ20 ఫార్మాట్‌లో 13000 పరుగులు పూర్తి చేసుకున్నారు.
టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా నిన్న (జులై 17) యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసిన బట్లర్.. తన జట్టు (లాంకాషైర్) విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్.. బట్లర్‌తో పాటు ఫిల్ సాల్ట్ (29 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. వీరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో లాంకాషైర్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్ కూడా తడబడింది. జేమ్స్ ఆండర్సన్ (4-0-25-3), క్రిస గ్రీన్ (4-0-27-3), లూక్ వుడ్ (4-0-33-2) చెలరేగడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. తద్వారా లాంకాషైర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. యార్క్‌షైర్‌ను గెలిపించేందుకు అబ్దుల్లా షఫీక్ (54) విఫలయత్నం చేశాడు.