జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా | Jasprit Bumrah becomes leading wicket-taker for Mumbai Indians in IPL | Sakshi
Sakshi News home page

IPL 2025: జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా

Apr 27 2025 10:53 PM | Updated on Apr 27 2025 10:53 PM

 Jasprit Bumrah becomes leading wicket-taker for Mumbai Indians in IPL

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. తన పేస్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

బుమ్రా తన బౌలింగ్‌లో కోటాలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జస్ప్రీత్ రికార్డులకెక్కాడు. 

ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకు  139 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 174 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ రికార్డు పేరిట ఉండేది. మలింగ 122 మ్యాచ్ ల్లో 170 వికెట్లు తీశాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును బుమ్ బుమ్రా బ్రేక్ చేశాడు. 

అయితే ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ కూడా కలిపితే ముంబై తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా మలింగ కొనసాగుతున్నాడు. ఈ శ్రీలంక దిగ్గజం రెండు లీగ్‌లు కలిపి ముంబై తరపున 195 వికెట్లు పడగొట్టాడు. మలింగ తర్వాతి స్దానంలో బుమ్రా(177) ఉన్నాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 215 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో రికెల్ట‌న్‌(58), సూర్య‌కుమార్ యాద‌వ్‌(54) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వీరితో పాటు న‌మ‌న్ ధీర్‌(25), జాక్స్‌(29), బాష్‌(20) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ల‌క్నో బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్, అవేష్ ఖాన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాద‌వ్‌, దిగ్వేష్‌, బిష్ణోయ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. అనంతరం 216 ప‌రుగుల భారీ లక్ష్య చేధనలో లక్నో చతకలపడింది. 20 ఓవర్లో 61 ప‌రుగుల‌కు ఆలౌటైంది. లక్నో బ్యాట‌ర్ల‌లో ఆయూష్ బ‌దోని(35) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మిచెల్ మార్ష్(34) ప‌ర్వాలేద‌న్పించాడు. ముంబై బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement