Photo Credit: Twitter
ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి నుంచి వరుస ఉదంతాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్, కోచ్‌లతో విభేదాలు, ముందస్తు సమాచారం లేకుండా ఆటగాళ్లను తొలగించడం వంటి వివాదాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జాసన్ గిలెస్పీ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది.
పాకిస్తాన్ టెస్టు జట్టుకు గిలెస్పీ కొంతకాలం కోచ్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. తాను కోచ్‌గా ఉన్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని భావించినప్పటికీ, చీఫ్ సెలెక్టర్‌గా అకీబ్ జావెద్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గిలెస్పీ పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు నుంచి నష్ట పరిహారం కింద తనకు వేల డాలర్లు రావాల్సి ఉందని వెల్లడించాడు.
పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిలెస్పీ మాట్లాడుతూ.. ‘‘అకిబ్ జావేద్ నియామకం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే పాకిస్తాన్ క్రికెట్‌తో నాకున్న అనుబంధం చెడిపో సాగింది. పాక్ జట్టు ఇప్పుడీ స్థితిలో ఉందంటే దానికి అకిబ్ జావెద్ కారణం. టెస్టు కోచ్‌గా ఎంపికైనప్పుడు జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని కలలు కన్నాను.
కానీ అకిబ్ జావెద్ రాకతో టెస్టు జట్టు కోచ్‌గా ఆటగాళ్లను, సిబ్బందిని పర్యవేక్షించడం, ఎంపికలో పాత్ర పోషించడం.. ఇలా అన్నింటిలోనూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని స్థితికి పడిపోయాను. అతడితో అనుభవం నన్ను పూర్తిగా నిరుత్సాహపరిచింది. కోచింగ్‌పైనే విరక్తి కలిగించింది. మానసికంగానూ నాపై ప్రభావం చూపించింది. అసలు ఇంకా క్రీడలో ఎందుకు కొనసాగాలన్న పరిస్థితి ఎదురైంది.
కోచ్‌గా వచ్చిన తర్వాత నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన అకిబ్ జావెద్ నన్ను అవమానించాడు. నా స్థాయిని పూర్తిగా తగ్గించాడు. అకిబ్‌కు చైర్మన్ మోసిన్ నఖ్వీతో పాటు బోర్డు మద్దతు ఉంది. అందుకే అతడిని ఎవరు ఏమీ చేయలేరని ధీమాగా ఉన్నాడు. అయితే నష్టపరిహారం కింద నాకు ఇవ్వాల్సిన వేల డాలర్లను ఇప్పటివరకు చెల్లించలేదు. అయితే ఈ విషయాన్ని నేను విడిచిపెట్టదలచుకోలేదు. ఈ విషయంలో ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు.
తెర ముందు పీసీబీ కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం అకిబ్ జావెద్ ఒక నియంత పాత్రను పోషిస్తున్నాడు. అకిబ్ జావెద్ ఉన్నంతకాలం పాకిస్తాన్ క్రికెట్ మరింత దారుణంగా తయారవుతుందే తప్ప ముందుకు వెళ్లదు. అసలు చైర్మన్, బోర్డులోని సభ్యులు, చీఫ్ సెలెక్టర్ తమ డెస్కుల వద్ద కూర్చుని కెప్టెన్‌ను ఎన్నుకోవడం అర్థరహితం. అకిబ్ జావెద్ వెళ్లిపోతేనే పాక్ క్రికెట్ మళ్లీ గాడిన పడుతుంది. అప్పటివరకు ఇంతే’’ అని ముగించాడు.
Jason Gillespie brutally COOKS Pakistan selector Aaqib Javed
"Aaqib is still chairman of selectors. He's kept his job. He's had a crack at Gary Kirsten and I, blaming us for where Pakistan cricket is where it is. Gary and I haven't even been there for two years."
"Yet, he has… pic.twitter.com/kIEWfzPvQk— Brutal Truth (@sarkarstix) September 8, 2026


