ఇది అసలు క్రికెటే కాదు.. రికార్డుల కోసం మాత్రమేనా?: గంభీర్‌ ఫైర్‌ | Its Not Cricket: Gambhir Unhappy Even As IND Beat WI In 800 Run 2nd ODI | Sakshi
Sakshi News home page

ఇది అసలు క్రికెటే కాదు.. రికార్డుల కోసం మాత్రమేనా?: గంభీర్‌ అసహనం

Oct 1 2026 10:33 AM | Updated on Oct 1 2026 11:00 AM

Its Not Cricket: Gambhir Unhappy Even As IND Beat WI In 800 Run 2nd ODI

గంభీర్‌ (PC: BCCI/X)

టీమిండియా- వెస్టిండీస్‌ మధ్య బుధవారం నాటి రెండో వన్డే సందర్భంగా పరుగుల వరద పారింది. గువాహటిలోని బర్సపరా స్టేడియం శతకాల మోతతో హోరెత్తిపోయింది. ఇరుజట్లలో కలిపి మొత్తం ఐదుగురు బ్యాటర్లు మెరుపు సెంచరీలతో చెలరేగారు.

శతకాల మోత
విండీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ జాన్‌ కాంప్‌బెల్‌ (68 బంతుల్లో 101), కెప్టెన్‌ షాయీ హోప్‌ (94 బంతుల్లో 104), ఆమిర్‌ జాంగో (77 బంతుల్లో 114) మెరుపులు మెరిపించగా.. టీమిండియా ఓపెనర్లలో రోహిత్‌ శర్మ (75 బంతుల్లో 101) శతక్కొట్టగా.. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఏకంగా అజేయ డబుల్‌ సెంచరీ (133 బంతుల్లో 223)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఫలితంగా కరేబియన్‌ జట్టు విధించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 43.3 ఓవర్లలోనే ఊదేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ తమ జట్టు విజయం సాధించినప్పటికీ.. బర్సపరా పిచ్‌ తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు.

ఇది అసలు క్రికెట్‌ కాదు
స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. క్రికెట్‌ అంటే బంతికి, బ్యాట్‌కి మధ్య కాస్త పోటీ ఉండాలి. కానీ ఇది అసలు క్రికెట్‌ కాదు. ఈరోజు ఇక్కడ కేవలం బ్యాటింగ్‌ మాత్రమే సాగింది.

ఓ యువ బౌలర్‌ ఇలాంటి వికెట్‌ మీద బౌలింగ్‌ చేస్తున్నపుడు ప్రత్యర్థి 400 పరుగులు చేయడం.. మేము ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించడం చూసినపుడు.. సదరు బౌలర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన రికార్డులు నెలకొల్పబడ్డాయి.

బౌలర్లను చూస్తే జాలేసింది
ప్రేక్షకులు కూడా సంతోషంతో కేరింతలు కొట్టారు. మీరు (ప్రసారకర్తలు) కూడా ఆనందంలో తేలిపోతున్నారు. కానీ ఒక నిజమైన క్రికెట్‌ అభిమానిగా నాకు మాత్రం ఇది అంతగా నచ్చలేదు. బౌలర్లను చూస్తే జాలేసింది. 

ఇలాంటి వికెట్ల మీద బౌలింగ్‌ చేయాల్సిరావడం అన్యాయమే అవుతుంది’’ అని గంభీర్‌ అసహనం, ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.

ధారాళంగా పరుగులు
భారత బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌ ఏకంగా 96 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు తీయగా.. అరంగేట్ర పేసర్ ఆకిబ్‌ నబీ 84 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక విండీస్‌ విధించిన లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసి.. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. కరేబియన్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ అత్యధికంగా 89 పరుగులు ఇచ్చుకున్నాడు.

చదవండి: Asian Games Men's Cricket: ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement