వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్
133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్స్‌లతో 223 నాటౌట్
406 పరుగుల లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో ఛేదించిన టీమిండియా
రెండో వన్డేలోనూ విండీస్ ఓటమి
రోహిత్ శర్మ సూపర్ సెంచరీ
ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు నమోదు
క్యాంప్‌బెల్, హోప్, జంగూ శతకాలు వృథా
గువాహటిలో భారత జట్టు పరుగుల వరద పారిస్తూ... శతకాల మోత మోగించింది. శుబ్‌మన్ గిల్ ‘డబుల్ సెంచరీ’తో కదం తొక్కగా... రోహిత్ శర్మ తనదైన శైలిలో ‘శత’క్కొట్టాడు. ఈ ఇద్దరి బాదుడుకు కరీబియన్ బౌలర్లు బెంబేలెత్తిపోగా... వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా తమ అత్యధిక లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. అంతకుముందు ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు బాదడంతో వెస్టిండీస్ తొలిసారి వన్డేల్లో 400 పరుగుల స్కోరు నమోదు చేసింది. అయినా... మనోళ్ల వీరవిహారం ముందు విండీస్ 405 స్కోరు కూడా చిన్నబోయింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
గువాహటి: భారత జట్టు అద్భుతం చేసింది. తమ వన్డే చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని 39 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసి 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. వన్డేల్లో విండీస్‌కిదే అత్యధిక స్కోరు.
జాన్ క్యాంప్‌బెల్ (68 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ షై హోప్ (94 బంతుల్లో 104; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అమిర్ జంగూ (77 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు చేశారు. ఒకే వన్డేలో ముగ్గురు వెస్టిండీస్ ప్లేయర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, గుర్‌నూర్ బ్రార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 43.3 ఓవర్లలో 2 వికెట్లకు 406 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (133 బంతుల్లో 223 నాటౌట్; 26 ఫోర్లు, 8 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో... ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ (75 బంతుల్లో 101; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో దంచికొట్టారు. వన్డేల్లో గిల్‌కు రెండో ద్విశతకంకాగా... రోహిత్‌కు 35వ సెంచరీ. ముందుగా గిల్ 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా... రోహిత్ 72 బంతుల్లో మూడంకెల మార్క్ అందుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 26.2 ఓవర్లలోనే 255 పరుగులు జోడించడంతో ఛేదన సులువైంది.
కోహ్లి (29; 3 ఫోర్లు, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (31 నాటౌట్; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచిన శుబ్‌మన్ 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి వన్డేల్లో వేగవంతమైన ద్విశతకం బాదిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్ కిషన్ (126 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. భారత బ్యాటర్ల దూకుడు ముందు కరీబియన్ బౌలర్లు తేలిపోయారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే శనివారం న్యూచండీగఢ్‌లో జరగనుంది.
1 లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు (223 నాటౌట్) చేసిన ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. మ్యాక్స్‌వెల్ (201 నాటౌట్; అఫ్గానిస్తాన్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు.
2 వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్ గిల్ (223 నాటౌట్; 208–న్యూజిలాండ్‌పై 2023లో). రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు చేశాడు. మార్టిన్ గప్టిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఫఖర్ జమాన్, మ్యాక్స్‌వెల్, ఇషాన్ కిషన్, నిసాంక, సచిన్ టెండూల్కర్ ఒక్కోసారి డబుల్ సెంచరీ కొట్టారు.
406 వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యధిక పరుగుల లక్ష్యఛేదన. 2013లో ఆ్రస్టేలియాపై టీమిండియా 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో ఇది రెండో అతిపెద్ద లక్ష్యఛేదన. 2006లో ఆ్రస్టేలియాపై దక్షిణాఫ్రికా 435 పరుగుల లక్ష్యాన్ని అధిగమించింది.
‘పంచ’శతకాలు
అంతర్జాతీయ వన్డేల్లో ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ పోరులో మొదట విండీస్ బ్యాటర్లు క్యాంప్‌బెల్, షై హోప్, అమీర్ జంగూ శతకాలు సాధించగా... భారీ లక్ష్యఛేదనలో భారత సారథి శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా... రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. గతంలో ఒకే వన్డే మ్యాచ్‌లో 4 సెంచరీలు మూడుసార్లు నమోదయ్యాయి.
‘హిట్ మ్యాన్’రోహిత్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత్ నుంచి సచిన్, కోహ్లి అతడికంటే ముందున్నారు. ఓవరాల్‌గా ఈ మార్క్ అందుకున్న ఏడో బ్యాటర్ రోహిత్.

స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) నమన్ ధీర్ (బి) బ్రార్ 101; కార్టీ (సి) నమన్ (బి) ప్రసిధ్ 9; హోప్ (సి) ఆఖిబ్ (బి) కుల్దీప్ 104; జంగూ (సి) గైక్వాడ్ (బి) జడేజా 114; రూథర్‌ఫోర్డ్ (సి) (సబ్) (జైస్వాల్) (బి) బ్రార్ 0; చేజ్ (నాటౌట్) 29; కీమో పాల్ (సి) కోహ్లి (బి)కుల్దీప్ 3; అల్జారీ (సి) రోహిత్ (బి) జడేజా 8; షమార్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 405. వికెట్ల పతనం: 1–37, 2–147, 3–329, 4–330, 5–348, 6–369, 7–385. బౌలింగ్: ప్రసిధ్ కృష్ణ 5–0–45–1; ఆఖిబ్ నబీ 8.5–0–84–0; గుర్‌నూర్ బ్రార్ 10–0–96–2; నమన్ ధీర్ 6.1–0–38–0; జడేజా 10–0–75–2; కుల్దీప్ 10–0–65–2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) సీల్స్ 101; గిల్ (నాటౌట్) 223; కోహ్లి (సి) రూథర్‌ఫోర్డ్ (బి) షమార్ 29; గైక్వాడ్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (43.3 ఓవర్లలో 2 వికెట్లకు) 406. వికెట్ల పతనం: 1–255, 2–320. బౌలింగ్: సీల్స్ 8–0–78–1; అల్జారీ జోసెఫ్ 8–0–89–0; షమార్ జోసెఫ్ 6–0–52–1; పాల్ 3–0–49–0; రోస్టన్ చేజ్ 8.3–0–63–0; విటెల్ 10–0–73–0.


