source: X
ఏషియన్ గేమ్స్ 2026లో 12వ రోజు (అక్టోబర్ 1) భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వాలీబాల్, ఆర్చరీ, స్క్వాష్‌లో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. సెపక్‌తక్రాలో మాత్రం భారత్‌కు పతకం ఖాయమైంది.
పాకిస్తాన్ చేతిలో ఓటమి
పురుషుల వాలీబాల్ క్వార్టర్‌ఫైనల్లో భారత్ పాకిస్తాన్ చేతిలో పరాజయంపాలైంది. 20-25, 27-29, 15-25 వరుస సెట్లలో ఓడి 0-3తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ పరాజయంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. పాక్ సెమీఫైనల్‌కు చేరుకుంది.
ఆర్చరీలో నిరాశ
మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ క్వార్టర్‌ఫైనల్లో భారత్‌కు చెందిన చికితా తనిపర్తి ఓటమి చవిచూసింది. ఇండోనేషియాకు చెందిన నురిసా దియాన్ అష్రిఫా చేతిలో 143-144 తేడాతో ఓడిపోయింది. టీమ్ ఈవెంట్లలో ఇప్పటికే రెండు స్వర్ణ పతకాలు సాధించిన చికితా వ్యక్తిగత విభాగంలో ముందుకు వెళ్లలేకపోయింది.
స్క్వాష్‌లో షాక్
స్క్వాష్‌లోనూ భారత్‌కు షాక్ తగిలింది. మహిళల టీమ్ సెమీఫైనల్లో అనాహత్ సింగ్‌కు నిరాశ ఎదురైంది. హాంకాంగ్‌తో జరిగిన పోరులో ఆమె ఓటమి పాలైంది. దీంతో ఈ విభాగంలో భారత స్వర్ణ పతక ఆశలకు ఎదురుదెబ్బ తగిలింది.
సెపక్‌తక్రాలో పతకం ఖాయం
సెపక్‌తక్రాలో భారత్ చారిత్రాత్మక ప్రదర్శన చేసింది. పురుషుల క్వాడ్రంట్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో వియత్నాంపై భారత్ 2-0తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్ బెర్త్ ఖరారు కావడంతో భారత్‌కు ఈ విభాగంలో కనీసం ఒక పతకం ఖాయమైంది.
కాగా, ఇవాళ పతకాల ఖాతా తెరవని భారత్, ఇప్పటివరకు సాధించిన 60 పతకాలతో (10 గోల్డ్, 21 సిల్వర్, 29 బ్రాంజ్) పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.
ఇదీ చదవండి: గురితప్పని బంగారు బాణం


