source: X
సౌతాఫ్రికా పర్యటనలో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా పరువు కాపాడుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ కాకుండా మర్యాద నిలుపుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఓడిన ఆ జట్టు, నిన్న జరిగిన నామమాత్రపు చివరి వన్డేలో గెలిచి 1-2తో సిరీస్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌ను కూడా ఆసీస్ పూర్తిగా ఆడి గెలవలేదు. సౌతాఫ్రికా ఛేదన సమయంలో వర్షం అడ్డుపడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాణించిన మార్ష్, క్యారీ
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, కెప్టెన్ మిచెల్ మార్ష్ (56), అలెక్స్ క్యారీ (74) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ 24, కూపర్ కన్నోల్లీ 23, ఒలివర్ పీక్ 48, రెన్షా 30, గ్రీన్ 23, బార్ట్‌లెట్ 2, కమిన్స్ 11, స్టార్క్ 11 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లు పడగొట్టగా.. గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్ తలో 2, ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 145-4 స్కోర్ (28 ఓవర్లు) వద్ద ఉండగా భారీ వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన అప్పటికి ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ర్యాన్ రికెల్టన్ 71, కార్బిన్ బాష్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఔటైన బ్యాటర్లలో మార్క్రమ్ 15, డికాక్ 0, బ్రీట్జ్కే 25, స్టబ్స్ 14 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బార్ట్‌లెట్, జంపా తలో 2 వికెట్లు పడగొట్టారు.
అక్టోబర్ 9 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 9 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ డర్బన్ వేదికగా, రెండో టెస్ట్ గ్వెబెర్హా వేదికగా అక్టోబర్ 18న, మూడో టెస్ట్ కేప్‌టౌన్ వేదికగా అక్టోబర్ 27న మొదలవుతాయి.
ఇదీ చదవండి: వన్డే చరిత్రలో తొలిసారి; ఒకే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు శతకాలు


