
PC: BCCI
పాంటింగ్ అలా.. ఇతడేమో ఇలా!
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న వేళ అనుకోని విధంగా వారం పాటు వాయిదా పడింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో లీగ్‌ను పునఃప్రారంభించేందుకు బోర్డు సిద్ధమైంది.
కొందరు వచ్చేశారు
ఇప్పటికే పది ఫ్రాంఛైజీలకు తమ ఆటగాళ్లందరినీ ఒకే చోట చేర్చాల్సిందిగా ఆదేశించిన బోర్డు.. శనివారం (మే 17) నుంచి మ్యాచ్‌లు కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు చేరుకోగా.. మరికొంత మంది జాతీయ జట్టు విధుల దృష్ట్యా స్వదేశాల్లోనే ఉండిపోయారు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఐపీఎల్ ఆడే విదేశీ ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఐపీఎల్ ఆడేందుకు తిరిగి ఇండియాకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే వదిలివేసింది.
నేనైతే ‘నో’ చెప్పేవాడిని
నిజానికి మధ్యలోనే ఇలా లీగ్‌ను వదిలివేయడం నిరాశకు గురిచేస్తుంది. ప్రొఫెషనల్‌గా, ఆర్థికంగా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగులుతాయి. అయితే, అన్నింటికంటే భద్రతే ముఖ్యం. ఒకవేళ నేనే గనుక వారి స్థానంలో ఉండి ఉంటే.. ఇండియాకు వెళ్లి లీగ్ పూర్తి చేయాలని ఆదేశించినా.. కచ్చితంగా ‘నో’ చెప్పేవాడిని.
ఎందుకంటే నా వరకు చెక్కుల కంటే కూడా ప్రాణాలు ముఖ్యమైనవి. అయితే, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఐపీఎల్ ఒక్కటనే కాదు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు కూడా ఆటగాళ్లు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనే నేను భావిస్తున్నా’’ అని మిచెల్ జాన్సన్ ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓప్పుకోవడానికి కారణం అదే
అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజులకే లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. కాబట్టి ఈ మెగా మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది’’ అని మిచెల్ జాన్సన్ పేర్కొన్నాడు.
అయితే, బీసీసీఐతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఉన్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా ప్రొటిస్ ఆటగాళ్లంతా తిరిగి ఐపీఎల్‌లో పాల్గొంటారని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీల సారథ్యంలోనే సౌతాఫ్రికా టీ20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
రిక్కీ పాంటింగ్ ఉండటమే కాదు.. వాళ్లనూ ఒప్పించాడు
ఇదిలా ఉంటే.. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ అక్కడ బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) ప్రకటించడంతో స్టేడియం కూడా చీకటైపోయింది.
ఈ క్రమంలో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించింది బీసీసీఐ. అంతేకాదు.. వందే భారత్ రైలులో అత్యంత భద్రత నడుమ పంజాబ్, ఢిల్లీ ఆటగాళ్లను ఢిల్లీకి చేర్చింది. ఈ నేపథ్యంలో కాస్త భయాందోళనకు లోనైనప్పటికీ.. భారత్‌లోనే ఉండిపోవాలని పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్, ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ నిర్ణయించుకున్నాడు.
బీసీసీఐ చేసిన ఏర్పాట్లు, భారత ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యల నేపథ్యంలో ఆటగాళ్లను కూడా ఇందుకు ఒప్పించాడు. అయితే, మిచెల్ జాన్సన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున రెండుసార్లు (2013, 2017) ఐపీఎల్ గెలిచిన జట్టులో జాన్సన్ సభ్యుడు.
చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్
ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..?