టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్‌ | Ireland Won By-34 Runs Vs Team India 1st T20I | Sakshi
Sakshi News home page

అన్నింటా విఫలం.. టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్‌

Jun 26 2026 9:36 PM | Updated on Jun 26 2026 10:10 PM

Ireland Won By-34 Runs Vs Team India 1st T20I

బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఐర్లాండ్ తొలి టీ20లో 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్‌ అభిషేక్ శర్మ (50) మినహా మిగిలినవారంతా దారుణంగా విఫలమయ్యారు. 

లోయర్ ఆర్డర్‌లో శివమ్ దూబే (25) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హొల్లార్డ్‌, మాథ్యూ హంపేరీస్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, భారత మూలాలున్న జై మూంద్రా రెండు వికెట్లు తీశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182  పరుగులు చేసింది.

కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్‌పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోవడమే టీమిండియా కొంపముంచింది. ఆరంభంలో హర్షిత్‌ రానా, అర్ష్‌దీప్‌ మంచి ఈజ్‌తో బౌలింగ్‌ చేసినప్పటికీ మిడిల్‌ ఓవర్లలో ధారాళంగా పరుగులొచ్చాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ఏ ఒక్క బ్యాటర్‌ కూడా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించలేదు. మొత్తంగా బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైన అయ్యర్‌ సేన దారుణ ఓటమిని మూటగట్టుకుంది.

ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌, ప్రపంచ చాంపియన్‌ అయిన టీమిండియాను పసికూన ఐర్లాండ్‌ ఓడించడం ఆ జట్టుకు సంచలనం కిందే లెక్క. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ టీమిండియా కెప్టెన్‌గా తొలి టీ20 మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ఇక భారత్‌పై ఐర్లాండ్‌ జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియాకు ఈ పరాజయం ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌పై చారిత్రాత్మక విజయం ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

చదవండి: అభిషేక్ శ‌ర్మ ఖాతాలో అరుదైన రికార్డు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement