IPL 2025: ఐపీఎల్‌ షెడ్యూల్‌లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ! | Is IPL Schedule To Change Amid Operation Sindoor Report Reveals Details | Sakshi
Sakshi News home page

Operation Sindoor: ఐపీఎల్‌ షెడ్యూల్‌లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ!

May 7 2025 4:15 PM | Updated on May 7 2025 5:59 PM

Is IPL Schedule To Change Amid Operation Sindoor Report Reveals Details

‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)నేపథ్యంలో ఐపీఎల్‌-2025లో షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి.

ఐపీఎల్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని.. లీగ్‌ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా మార్చి 22న ఐపీఎల్‌ పద్దెనిమిదవ ఎడిషన్‌ మొదలు కాగా.. మే 6 నాటికి 56 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో రెండు మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యాయి.

టాప్‌లో గుజరాత్‌
ఈ క్రమంలో పదకొండింట ఎనిమిది విజయాలతో గుజరాత్‌ టైటాన్స్‌ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకి కొనసాగుతుండగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కూడా 16 పాయింట్లు ఉన్నా రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది.

మరోవైపు.. పంజాబ్‌ కింగ్స్‌ (15 పాయింట్లు), ముంబై ఇండియన్స్‌ (14 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్‌ (13 పాయింట్లు), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (11 పాయింట్లు), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (10 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (7 పాయింట్లు), రాజస్తాన్‌ రాయల్స్‌ (6 పాయింట్లు), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (4 పాయింట్లు) ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.

ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు 
కాగా ముంబై ఇండియన్స్‌ - గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌ వర్షం వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. అయితే, ఈ మ్యాచ్‌ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి.. వాటిని ధ్వంసం చేసింది.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలాంటి సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్‌ మ్యాచ్‌లు వాయిదా వేస్తారేమోనని సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యలో బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.

దేశ ‍ప్రయోజనాలే ముఖ్యం
ఇక ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయాలను బీసీసీఐ శిరసా వహిస్తుందని స్పష్టం చేశారు. సమయానికి తగినట్లు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామని పేర్కొన్నారు.

‘‘ఐపీఎల్‌ పాలక మండలి ఈ పరిస్థితులను గమనిస్తోంది. ఐపీఎల్‌ షెడ్యూల్‌ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదీ మన చేతుల్లో లేదు. దేశ ‍ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ అందుకు కట్టుబడి ఉంటుంది. మద్దతుగా ఉంటుంది’’ అని అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నారు.

సురక్షితం, భద్రం
ఇక టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ స్పందిస్తూ.. ‘‘భారత్‌లో ప్రతి ఒక్కరు సురక్షితంగా, భద్రంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. మన దేశ సైన్యంపై అందరికీ అమితమైన విశ్వాసం ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా తాము భద్రంగా ఉన్నామని, ఉంటామని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి లీగ్‌లో మార్పులు ఉండవనే అనుకుంటున్నా’’ అని ధీమా వ్యక్తం చేశాడు.

చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement