RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్‌ సూర్యవంశీ | "Dont Be In A Double Mind...": Vaibhav Suryavanshi Comments After Record Making Hundred Over Gujarat | Sakshi
Sakshi News home page

RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్‌ సూర్యవంశీ

Published Tue, Apr 29 2025 12:17 PM | Last Updated on Tue, Apr 29 2025 1:08 PM

IPL 2025: Vaibhav Suryavanshi Comments After Record Making Hundred Over Gujarat

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్‌ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.

వైభవ్‌ సాధించిన రికార్డులు..
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)
ఐపీఎల్‌లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) తర్వాత)
ఐపీఎల్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్‌తో కలిసి)
టీ20 క్రికెట్‌ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
ఐపీఎల్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
ఐపీఎల్‌ 2025లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (17 బంతుల్లో)
ఐపీఎల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడు

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. వైభవ్‌ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్‌ గెలుపులో వైభవ్‌తో పాటు మరో ఓపెనర్‌  యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.

మ్యాచ్‌ అనంతరం వైభవ్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్‌లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్‌లోనే సాకారం చేసుకున్నాను. సీజన్‌ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్‌లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్‌ చేస్తాడు.  ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.

కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్‌ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్‌ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement