
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది.
అన్నీ డబుల్ హెడర్‌లేనా?
ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్‌ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది.
హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్
హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.