
PC: BCCI/IPL.com
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి వచ్చే వారం ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో త్వరలోనే ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పోర్ట్స్ టాక్ తమ కథనంలో పేర్కొంది. పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్ధావరాలపై దాడులు చేసింది.
ఈ ఆపరేషన్‌లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సాయుధ దళాలు మట్టుబెట్టాయి. అనంతరం పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి కాల్పులు జరపడం, అందుకు భారత్ ధీటుగా బదులివ్వడం వంటి చర్యలు జరిగాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే శనివారం ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌కు ఒప్పుకొన్నాయి. ఈ విషయాన్ని భారత్-పాకిస్తాన్ అధికారికంగా ధ్రువీకరించాయి. మే 10 సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.

మే 12న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ మళ్లీ తొలి బంతి నుంచి ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. రెండు మూడు రోజుల్లో కొత్త షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలకమండలి ఖారారు చేసే అవకాశముంది.
చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు