యాషెస్ నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు.. రిలాక్స్ అవ్వడానికి క్వీన్స్‌ల్యాండ్‌లోని నూసాకు వెళ్లారు. అయితే ఈ బ్రేక్‌లో ఇంగ్లీష్ ఆటగాళ్లు మితిమీరి మద్యం సేవించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ మద్యం మత్తులో రోడ్డుపై తిరుగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. రోడ్డుపై ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితిలో డకెట్ కన్పించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ విచారణకు ఆయన ఆదేశించారు.
ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో బెన్ డకెట్‌ను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. రెండో రోజు ఆటలో డకెట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని అతడిని ఎగతాళి చేస్తూ "నీకు ఒక బీర్ కావాలా?" అని గట్టిగా అరిచాడు. వెంటనే అభిమానుల వైపు చూస్తూ, డకెట్ నవ్వుతూ.. "సరే, తీసుకురండి చూద్దాం!" అన్నట్లుగా బీరు తాగే సైగలు చేశాడు.
అతడి సమాధానం విన్న ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయి చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పటికే 3-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌ను కోల్పోయింది.
చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!


