IPL 2023: ‘అంతా ధోని మాయ’

Sunil Gavaskar Hails Dhoni Captaincy - Sakshi

ధోని కెప్టెన్సీపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసలు

ఇంగ్లండ్‌ గడ్డపై నా (సునీల్‌ గావస్కర్‌) తొలి టెస్టు సిరీస్‌ రోజుల్లోకి ఒక్కసారి వెళ్లి చూస్తే... చివరి టెస్టులో మా విజయలక్ష్యం 172 పరుగులు. దానిని అందుకుంటే ఇంగ్లండ్‌లో భారత్‌ మొదటిసారి టెస్టు సిరీస్‌ గెలుస్తుంది. నాలుగో రోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించడంతో లక్ష్యం చేరేందుకు ఒక రోజంతా మా వద్ద మిగిలింది. అప్పుడు ఇంగ్లండ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రే ఇల్లింగ్‌వర్త్‌ నా దృష్టిలో అత్యంత చురుకైన సారథి.

ఒక్క సులువైన పరుగు కూడా ఇవ్వకుండా కట్టిపడేయడంతో మా దృష్టిలో లక్ష్యం 572 పరుగులుగా కనిపించింది! చివరకు 75 ఓవర్లు ఆడి మేం మ్యాచ్‌ గెలవగలిగాం. చిదంబరం స్టేడియంలో ధోని కూడా తక్కువ లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చిరునవ్వులు చిందిస్తూనే గుజరాత్‌కు అదే తరహా భావన కల్పించాడు. అతని బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ వ్యూహాలతో గుజరాత్‌ ఆటగాళ్లు కదల్లేకపోయారు. అలవోకగా లక్ష్యాలు ఛేదించే తమకు ఏం జరిగిందో అని వారు కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు.

అది అర్థమయ్యేసరికి వారికి ఓటమి ఖాయమైపోయింది. పిచ్‌ కాస్త నెమ్మదించి టర్న్‌కు అనుకూలించిందనేది వాస్తవమే అయినా దానిని ధోని సమర్థంగా వాడుకోవడమే చెప్పుకోదగ్గ అంశం. అంతకుముందు రుతురాజ్‌ గైక్వాడ్, డెవాన్‌ కాన్వే చెన్నైకి కావాల్సిన సరైన ఆరంభాన్ని అందిస్తే రాయుడు, జడేజా కలిసి స్కోరును 172 వరకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ధోని గతంలో ఎన్నోసార్లు చేసినట్లుగానే మళ్లీ తన మాయ చూపించాడు. చెన్నై జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.   

చదవండి: ఐదు వికెట్లతో చెలరేగిన ఆకాశ్‌ మద్వాల్‌.. క్వాలిఫయర్‌-2కు ముంబై

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top