
న్యూఢిల్లీ: 2030 కామన్వెల్త్ క్రీడలను స్వదేశంలో నిర్వహించాలనే ఉద్దేశంతో వేసిన బిడ్‌ను భారత ఒలింపిక్ సంఘం (IOA) బుధవారం ఆమోదించనుంది. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న భారత్... 2036 ఒలింపిక్స్ నిర్వహణకు సైతం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వక్రీడలకు ముందు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించి మన సత్తా ప్రపంచానికి చాటాలనుకుంటోంది.
ఇప్పటికే ఈ క్రీడలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్నట్లు కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యకు భారత్ వెల్లడించింది. అహ్మదాబాద్‌లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. బిడ్‌లు దాఖలు చేసేందుకు ఈ నెల 31 తుదిగడువు కాగా... దానికి ముందే ఫైనల్ బిడ్ వేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో నేడు జరగనున్న భారత ఒలింపిక్ సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ఇతర అంశాలు సైతం సమావేశంలో చర్చకు రానున్నాయి.
ఆతిథ్య రేసు నుంచి కెనడా అవుట్
ఇక ఆతిథ్య రేసు నుంచి కెనడా తప్పుకోవడంతో... భారత్‌కే హక్కులు దక్కే అవకాశాలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని అధికారుల బృందం మూడు రోజుల పాటు అహ్మదాబాద్‌లో పర్యటించి వేదికలను పరిశీలించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించింది.
ఈ నెలాఖరులో కామన్వెల్త్ గేమ్స్‌కు చెందిన మరో ప్రతినిధి బృందం భారత్‌ను సందర్శించనుంది. ఆతిథ్య హక్కుల ప్రకటన ఈ ఏడాది నవంబర్‌లో వెలువడే అవకాశాలున్నాయి.
‘కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు పలు అంశాలతో ముడిపడి ఉంటాయి. క్రీడా సదుపాయాలు, ప్రభుత్వ సహకారం, నిర్ణయాల్లో స్థిరత్వం, ఆకర్షణ ఇలాంటివి కీలకం. 2030 కామన్వెల్త్ ఆతిథ్య హక్కులు భారత్‌కే దక్కుతాయనే నమ్మకముంది’ అని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు హర్‌పాల్ సింగ్ పేర్కొన్నారు.