
నేటి నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టు
జోరు మీదున్న గిల్ బృందం
సంచలనంపై విండీస్ ఆశలు
ఉదయం గం. 9:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
సొంతగడ్డపై టెస్టుల్లో భారత్ దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురులేని జట్టుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. పర్యటనకు వచ్చిన పెద్ద జట్లు కూడా టీమిండియా జోరును ఆపలేకపోయాయి. అయితే పుష్కర కాలం తర్వాత బలహీనం అనుకున్న న్యూజిలాండ్ పెద్ద దెబ్బ కొట్టింది.
గత ఏడాది అనూహ్యంగా కివీస్ చేతిలో భారత్ క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మన టీమ్‌స్వదేశంలో టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా బలహీనమైన వెస్టిండీస్ ఎదురుగా ఉంది. ఇంగ్లండ్‌పై చక్కటి ప్రదర్శన తర్వాత ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ఆడితే విండీస్‌పై పైచేయి ఖాయం. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది.
అహ్మదాబాద్: శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి మొదటి టెస్టు జరుగుతుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల రిటైర్మెంట్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆడనున్న మొదటి టెస్టు ఇదే కానుంది.
ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ఆటతో సిరీస్‌ను సమం చేసుకున్న టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆసీస్‌తో ఆడిన గత టెస్టులో ‘27 ఆలౌట్’ తర్వాత విండీస్ ఇదే మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. బలాబలాల్లో ఎంతో అంతరం కనిపిస్తుండగా, కరీబియన్ టీమ్ ఇక్కడ ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే.
అదనపు పేసర్‌తో...
సాధారణంగా స్వదేశంలో నల్లరేగడి మట్టితో సిద్ధం చేసే స్పిన్ అనుకూల పిచ్‌లపై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి టీమ్ మేనేజ్‌మెంట్ ఉద్దేశపూర్వకంగా పేస్‌కు అనుకూలించే ‘ఎర్ర మట్టి’ పిచ్‌పై తమ సత్తాను పరీక్షించుకోవాలని భావిస్తోంది. దీని ప్రకారమే తుది జట్టు ఉండవచ్చు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఖాయం.
స్పిన్ ఆల్‌రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం. అయితే మూడో స్పిన్నర్ అయిన కుల్దీప్, మరో పేసర్ మధ్య పోటీ ఉండవచ్చు. పిచ్‌ను బట్టి చూస్తే ప్రసిధ్ వైపే మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆరో స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడిస్తే అప్పుడు కుల్దీప్‌కు అవకాశం ఉంటుంది.
నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటర్ పడిక్కల్‌ను కూడా పక్కన పెట్టాల్సి రావచ్చు. ఇంగ్లండ్‌లో పెద్దగా ఆకట్టుకోకపోయినా నితీశ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. బ్యాటింగ్‌పరంగా యశస్వి, గిల్, రాహుల్ చక్కటి ఫామ్‌లో ఉండగా సుదర్శన్ కూడా ఇటీవల ఆ్రస్టేలియా ‘ఎ’పై సత్తా చాటాడు.
అందరూ అంతంతే!
‘మా గెలుపుపై ఎవరికీ అంచనాలు లేకపోవడమే మా బలం. ఓటమి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడతాం. కివీస్‌ను ఆదర్శంగా తీసుకుంటాం’ అని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ చెబుతున్నాడు. కానీ భారత్‌లో టెస్టులు అంటే ఎంతో కష్టమో విండీస్‌కు బాగా తెలుసు. 1994లో భారత్‌ను ఓడించిన తర్వాత ఇక్కడ ఆడిన 10 టెస్టుల్లో విండీస్ 8 ఓడి, 2 ‘డ్రా’ చేసుకుంది.
2018లో ఆడిన సిరీస్‌లో 2 టెస్టులూ మూడు రోజులకే ముగిశాయి! పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి జట్టును నడిపించగల బ్యాటర్ ఎవరూ కనిపించడం లేదు. హోప్, ఛేజ్, వారికన్‌లకు మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉండగా, జేడెన్ సీల్స్ ఇటీవల ఆకట్టుకుంటున్నాడు. ప్రధాన పేసర్లు అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం పెద్ద లోటు. విండీస్ కూడా ముగ్గురు పేసర్లతో ఆడనుంది.
పిచ్, వాతావరణం
పిచ్‌పై పచ్చికను ఎక్కువగా ఉంచారు. పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాగా బ్యాటర్లు పట్టుదల కనబర్చాల్సి ఉంది. నగరంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలు మ్యాచ్‌కు స్వల్పంగా అంతరాయం కలిగించవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, నితీశ్ రెడ్డి/పడిక్కల్, జడేజా, సుందర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/ప్రసిధ్.
వెస్టిండీస్: ఛేజ్ (కెప్టెన్ ), చందర్‌పాల్, కెవ్లాన్ అండర్సన్, అతనజె, బ్రెండన్ కింగ్, షై హోప్, గ్రీవ్స్, పైర్, వారికన్, ఫిలిప్ అండర్సన్, సీల్స్.