ఆసియా పారా క్రీడలకు బయలుదేరిన భారత బృందం
ఈ నెల 18 నుంచి జపాన్‌లోని నగోయాలో గేమ్స్
భారత్ నుంచి బరిలో 60 మంది పారా అథ్లెట్లు
న్యూఢిల్లీ: ఆసియా పారా క్రీడల్లో పాల్గొనే భారత బృందం గురువారం జపాన్ బయలుదేరింది. ఈ నెల 18 నుంచి 25 వరకు నగోయా వేదికగా ఆసియా పారా క్రీడలు జరగనుండగా... గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి జపాన్ బయలుదేరిన భారత పారా అథ్లెట్ల బృందానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కొత్త జెర్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ... ‘పారా అథ్లెట్లు ఇప్పటికే జీవితంలో ఎన్నో పోరాటాలను అధిగమించిన విజేతలు. ప్రకృతిని, సమాజాన్ని ఎదిరించి ఈ స్థాయికి చేరుకున్నారు.
ఇప్పుడు వీరంతా ఆసియా పారా క్రీడల్లో పతకాలు సాధించి భారత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేందుకు సిద్ధమయ్యారు. జీవితంలో విజయాలు సాధించిన వీరు... ఏషియన్ గేమ్స్‌లో కేవలం పతకాలు మాత్రమే సాధించాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఏషియన్ గేమ్స్‌లో ప్రతీ అథ్లెట్ తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అథ్లెట్లు ఎప్పుడూ ఓడిపోరని... గెలిస్తే పతకాలు, ఓడితే అనుభవం గడిస్తారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
గతంలో ఆసియా పారా క్రీడల్లో భారత కోటా 130 ఉండగా... ఇప్పుడది 60కి తగ్గించినప్పటికీ... ఈ క్రీడల్లో 95 పతకాల వరకు సాధిస్తామని హెడ్ కోచ్ సత్యనారాయణ తెలిపారు. కోటా తగ్గించిన కారణంగా సెలెక్షన్ ప్రక్రియను మరింత కఠినతరం చేసి అథ్లెట్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 18న జరగనున్న ఆసియా పారా క్రీడల ప్రారంభోత్సవంలో ప్రమోద్ భగత్, భవీనా పటేల్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. 19 నుంచి పతక పోటీలు ప్రారంభం కానున్నాయి.


