
బ్యాంకాక్: ఆసియా అండర్–19 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 14 పతకాలను సొంతం చేసుకున్నారు. ఇందులో మహిళా బాక్సర్లవే తొమ్మిది పతకాలు ఉండటం విశేషం. ముస్కాన్ (57 కేజీలు), నిషా (54 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... ఆర్తి కుమారి (75 కేజీలు), కృతిక వాసన్ (80 కేజీలు), ప్రాచీ టోకస్ (ప్లస్ 80 కేజీలు), వినీ (60 కేజీలు), నిషా (65 కేజీలు) రజత పతకాలు గెలిచారు.
యశిక (51 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్స్‌లో ముస్కాన్ 3:2తో అయజాన్ ఎర్మెక్ (కజకిస్తాన్)పై, నిషా 4:1తో సిరుయ్ యాంగ్ (చైనా)పై నెగ్గారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాహుల్ కుందు బంగారు పతకాన్ని సాధించాడు. ఫైనల్లో రాహుల్ 4:1తో యాకుబోవెక్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. ఫైనల్లో ఓడిన మౌజమ్ సుహాగ్ (65 కేజీలు), హేమంత్ సాంగ్వాన్ (90 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. శివమ్ (55 కేజీలు), గౌరవ్ (85 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.