BGT 2023: గెలుపెవరిది.. రికార్డులు ఏం చెబుతున్నాయి..?

India Vs Australia Head To Head Records In Test Matches - Sakshi

BGT 2023: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ మరికొద్ది రోజుల్లో (ఫిబ్రవరి 9) ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. బెంగళూరులో ఆస్ట్రేలియా, తొలి టెస్ట్‌కు వేదిక అయిన నాగ్‌పూర్‌లో టీమిండియా కఠోర సాథన చేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా భారత్‌లో టెస్ట్‌ సిరీస్‌ గెలవలేదన్న అపవాదు మోస్తున్న ఆసీస్‌.. ఈ సిరీస్‌ విజయంతో ఆ అపవాదును చెరిపి వేయాలని భావిస్తుంటే, ఎలాగైనా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి (4-0) ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23  ఫైనల్‌కు చేరాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ దాయాదుల సమరం కంటే రసవత్తరంగా మారనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఇరు జట్లలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుత సమీకరణలు, జట్టులోకి ఆటగాళ్లు, ఇటీవలి కాలంలో వారి ఫామ్‌, రికార్డులు, పిచ్‌లు, వాతావరణం తదితర అంశాలను పరిశీలించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయని విశ్లేషిస్తే.. మెజార్టీ శాతం అభిప్రాయం టీమిండియాకే అనుకూలంగా ఉంది. 

ఎందుకంటే.. స్పిన్‌కు సహకరిస్తూ, బ్యాటర్ల స్వర్గధామంగా నిలిచే స్వదేశీ పిచ్‌లపై భారత్‌ను ఓడించడమన్నది ఎంతటి జట్టుకైనా దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. రికార్డులే ఇందుకు సాక్ష్యం. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల ఫామ్‌ చూస్తే మునుపటి కంటే అధికంగా రెచ్చిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. సింహాల్లా గర్జించే భారత ఆటగాళ్లను ఆపడం ఈ సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాళ్లకు కత్తి మీద సాము అవుతుంది. దీనికి తోడు ఆసీస్‌ ఆటగాళ్లకు ఉన్న వీక్‌నెస్‌లు ఉండనే ఉన్నాయి.

ఉపఖండపు పిచ్‌లపై తేలిపోవడం, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో వైఫల్యం చెందడం, సొంత జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం వంటి సమస్యలు ఆసీస్‌ను వేధిస్తున్నాయి. ప్రస్తుతం వారికి కలిసొచ్చే ఏకైక విషయం ఏంటంటే.. బ్యాటర్లు స్టీవ్‌ స్మిత్‌, లబూషేన్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, ఆల్‌రౌండర్‌ ట్రవిస్‌ హెడ్‌  ఫామ్‌లో ఉండటం. అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ జట్టులో ఉన్నా.. భారత పిచ్‌లపై అతనికి సరైన ట్రాక్‌ రికార్డు లేదు. మరో స్పిన్నర్‌ మిచెల్‌ స్వెప్సన్‌, పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ జట్టులో ఉన్నా, వారి ప్రభావం​ తక్కువనే చెప్పాలి.

ఇక ఆ జట్టుకు బలమైన పేస్‌ విభాగం ఇక్కడి పిచ్‌లపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకునే మెజార్టీ మంది క్రికెట్‌ అభిమానులు భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఇక టీమిండియాకు కలిసొచ్చే విషయాలు ఏవంటే.. బ్యాటర్లు గిల్‌, కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ భీకర ఫామ్‌లో ఉండటం, స్పిన్‌ విభాగం కుల్దీప్‌, అశ్విన్‌, అక్షర్‌, జడేజాలతో దుర్భేద్యంగా ఉండటం, పేస్‌ బౌలింగ్‌ విభాగంలో సిరాజ్‌ అద్భుత ఫామ్‌లో ఉండటం వంటి అంశాలు భారత విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. 

ఇక గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే..  భారత్‌-ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్‌ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్‌ 12, భారత్‌ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్  

సిరీస్‌ షెడ్యూల్‌..

  • ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్‌, నాగ్‌పూర్‌
  • ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్‌, ఢిల్లీ
  • మార్చి 1-5 వరకు మూడో టెస్ట్‌, ధర్మశాల
  • మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌, అహ్మదాబాద్‌

వన్డే సిరీస్‌..

  • మార్చి 17న తొలి వన్డే, ముంబై
  • మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం
  • మార్చి 22న మూడో వన్డే, చెన్నై
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top