కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు.. తమ తప్పిదాలను సరిదిద్దుకునేందుకు సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి గౌహతిలో ప్రోటీస్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనుంది.
అయితే భారత జట్టు గౌహతిలో కాకుండా ఈడెన్ గార్డెన్స్‌లోనే మొదటి ట్రైనింగ్ సెషన్‌ను మంగళవారం(నవంబర్ 18) నిర్వహించనుంది. ఈడెన్ లాంటి కఠినమైన వికెట్‌పై తమ ప్లేయర్లను ప్రాక్టీస్ చేయించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన గంభీర్ ఈడెన్‌గార్డెన్స్ పిచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌లో ఎటువంటి భూతాలు లేవని, మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే ఇటువంటి వికెట్‌పై పరుగులు సాధించవచ్చు అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్ జరిగిన పిచ్‌పై భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేసే అవకాశముంది.
గౌహతికి ఎప్పుడంటే?
కాగా బుధవారం మెన్ ఇన్ బ్లూ గౌహతికి పయనం కానుంది. అయితే తొలి ప్రాక్టీస్ సెషన్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నాడు. మెడ నొప్పి గాయం నుంచి గిల్ కోలుకుంటున్నాడు.
ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గిల్ ప్రస్తుతం టీమ్ హోటల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్ మెడపట్టేసింది. దీంతో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి గిల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత అతడిని ఆస్ప్రత్రికి తరలించారు. 24 గంటల పర్యవేక్షణ తర్వాత గిల్ ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతడు మెడ అటు ఇటు కదపుతున్నప్పటికి వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో శుభ్‌మన్ గౌహతి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది.
ఒకవేళ గిల్ అందుబాటులో లేకపోతే అతడి స్దానంలో సాయిసుదర్శన్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా తొలి టెస్టులో భారత్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా పరాజయం పాలైంది.
చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ


