కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో తాము కోరుకున్న పిచ్‌పై టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. బౌలర్లు రాణించినప్పటికి బ్యాటర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు.
కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు 12 ఏళ్ల తర్వాత ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు కీలక సూచనలు చేశాడు. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని తిరిగి టెస్టు జట్టులోకి తీసుకోవాలని దాదా కోరాడు.
అతడొక మ్యాచ్ విన్నర్..
"భారత టెస్టు జట్టులోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు షమీ అన్నిరకాలగా అర్హుడు. అతడొక మ్యాచ్ విన్నర్. షమీతో పాటు మంచి స్పిన్నర్లు జట్టులో ఉంటే టీమిండియాకు తిరిగుండదు. నాకు గౌతమ్ గంభీర్ అంటే చాలా ఇష్టం. అతడు 2007, 2011 టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అతడికి చాలా అనుభవం ఉంది. గౌతమ్ హెడ్ కోచ్ పదవిలో కొన్నాళ్ల పాటు కొనసాగుతాడన్న నమ్మకం నాకుంది.
కానీ సొంతగడ్డపై ఆడుతున్నప్పడు బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను ఎంచుకోవాలి. పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు ముగ్గురు జట్టులో ఉండాలి. వీరిపై గంభీర్ నమ్మకం ఉంచాలి" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా పేర్కొన్నాడు. కాగా షమీ చివరగా భారత తరపున టెస్టుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2023 ఫైనల్లో ఆడాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్‌లకు షమీ ఎంపిక చేయలేదు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే షమీని పక్కన పెట్టినట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాడు. కానీ షమీ మాత్రం తను ఫిట్‌గా ఉన్నప్పటికి ఎంపిక చేయడం లేదని సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు.
చదవండి: IND vs SA: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే


