కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మెడకు గాయమైన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఆస్ప్రత్రి నుంచి ఆదివారం గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. అతడు ప్రస్తుతం టీమ్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
మెడ గాయం నుంచి కోలుకుంటున్నందున గిల్‌కు విమాన ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అతడికి కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టీమ్ హోటల్‌లో ఉన్న గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుంది.
అయితే ప్రస్తుతం అతడు మెడను ఈజీగా అటూ ఇటూ కదపగలుగుతున్నాడు. కానీ గౌహతి వేదికగా జరిగే రెండో టెస్టులో అతడు ఆడుతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు గిల్‌ను మాజీ భారత కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరామర్శించాడు.
గిల్ ఎలా గాయపడ్డాంటే?
తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్ ప్రయత్నంలో గిల్ మెడపట్టేసింది. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడు మూడు బంతులు ఆడిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అయితే అతడి గాయం తీవ్రతరం కావడంతో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. గిల్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వార్తలు వచ్చాయి.
24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాక అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గిల్ రెండు ఇన్నింగ్స్‌లకు దూరం కావడం టీమిండియా కొంపముంచింది. గిల్ లేకపోవడంతో భారత జట్టును వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుండి నడిపించాడు. ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో భారత్ అనుహ్య ఓటమిని చవిచూసింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక భారత్ చతికలపడింది.
చదవండి: PAK vs SL 3rd Odi: శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్..


