జురేల్‌ అజేయ శతకం | India A team scored a huge score in the ongoing Test against Sri Lanka A | Sakshi
Sakshi News home page

జురేల్‌ అజేయ శతకం

Jun 27 2026 3:13 AM | Updated on Jun 27 2026 3:13 AM

India A team scored a huge score in the ongoing Test against Sri Lanka A

భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ 452/6 డిక్లేర్డ్‌

శ్రీలంక ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 113/2

గాలె: శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 333/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ధ్రువ్‌ జురేల్‌ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు 111.4 ఓవర్లలో 452/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ ధ్రువ్‌ జురేల్‌ (215 బంతుల్లో 141 నాటౌట్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకంతో కదంతొక్కాడు. 

ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు షేక్‌ రషీద్‌ (113 బంతుల్లో 63; 5 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో పది పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. దీంతో 136 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. రషీద్‌ అవుటైనా... హర్ష్ దూబే (51 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో ధ్రువ్‌ జురేల్‌ దూకుడు కొనసాగించాడు. లంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న జురేల్‌... వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 

లంక బౌలర్లలో చమిక గుణశేకర 3 వికెట్లు పడగొట్టగా... డిలుమ్‌ సుదీర రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక ‘ఎ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. నువానీడు ఫెర్నాండో (103 బంతుల్లో 65 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) అజేయ హాఫ్‌సెంచరీతో పోరాడుతున్నాడు. ఓపెనర్లు నిరోషన్‌ డిక్‌వెల్లా (10), పవంత వీరసింఘే (11) విఫలమవడంతో ఒక దశలో లంక 38/2తో కష్టాల్లో పడింది. 

అయితే ఈ దశలో అషెన్‌ బండారా (51 బంతుల్లో 18 బ్యాటింగ్‌; 3 ఫోర్లు)తో కలిసి ఫెర్నాండో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒక్కో పరుగు జోడిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న శ్రీలంక ‘ఎ’ జట్టు... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు స్కోరుకు ఇంకా 339 పరుగులు వెనుకబడి ఉంది. ఫెర్నాండో, బండారా క్రీజులో ఉన్నారు. భారత ‘ఎ’ బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్, యశ్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement