వెస్టిండీస్‌ 'షై'నింగ్‌ | India lost the second T20I by 6 wickets against West Indies | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌ 'షై'నింగ్‌

Oct 10 2026 4:22 AM | Updated on Oct 10 2026 4:26 AM

India lost the second T20I by 6 wickets against West Indies

కెప్టెన్‌ షై హోప్‌ అజేయ సెంచరీ 

45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్‌

250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన విండీస్‌  

రెండో టి20లో టీమిండియా పరాజయం 

రేపు ఇండోర్‌లో మూడో మ్యాచ్‌

పరుగుల వరద పారిన పోరులో టీమిండియా పరాజయం పాలైంది. సంజూ సామ్సన్, శ్రేయస్‌ అయ్యర్, తిలక్‌ వర్మ మెరుపులతో భారత జట్టు ప్రత్యర్థి ముందు 250 పరుగు లక్ష్యాన్ని నిర్దేశించగా... షై హోప్‌ అజేయ శతకానికి రూథర్‌ఫోర్డ్‌ ఊచకోత తోడవడంతో విండీస్‌ మరో 9 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ చేజ్‌ చేసింది. ఇరు జట్లు కలిపి 501 పరుగులు నమోదు చేసిన ఈ మ్యాచ్‌ అభిమానులకు మస్తు మజా పంచింది.  

రాంచీ: టీమిండియాతో తొలి టి20లో తేలిపోయిన వెస్టిండీస్‌... రెండో మ్యాచ్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టి20లో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓడింది. శ్రేయస్‌ కెప్టెన్సీలో వరుసగా పది విజయాల తర్వాత భారత జట్టుకు ఇదే తొలి పరాజయం. ఫలితంగా విండీస్‌ 1–1తో సిరీస్‌ సమం చేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 

సంజూ సామ్సన్‌ (41 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... తిలక్‌ వర్మ (18 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (18 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (22 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. విండీస్‌ బౌలర్లలో చేజ్‌ 24 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అంతర్జాతీయ టి20ల్లో ఇది రెండో అతిపెద్ద ఛేదన. 

కెప్టెన్‌ షై హోప్‌ (45 బంతుల్లో 102 నాటౌట్‌; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించగా... షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (37 బంతుల్లో 84; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), రొమారియో షెఫర్డ్‌ (13 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించారు. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ 3 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇండోర్‌లో మూడో టి20 జరగనుంది.  

బాదుడే బాదుడు... 
కొండంత లక్ష్యఛేదనకు దిగిన కరీబియన్‌ జట్టుకు తొలి ఓవర్‌లోనే షాక్‌ మీద షాక్‌ తగిలింది. ఓపెనర్‌ కమిల్‌ పూరన్‌ (4), హెట్‌మైర్‌ (0)ను మయాంక్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. కాసేపటికి రావ్‌మన్‌ పావెల్‌ (24)ను సైతం అతడే వెనక్కి పంపాడు. దీంతో విండీస్‌ ఒక దశలో 58/3తో కష్టాల్లో పడింది. అయితే భారత్‌తో చివరి వన్డేలో భారీ సెంచరీ బాదిన కెప్టెన్‌ హోప్‌ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా మైదానం నలువైపులా మెరుపు షాట్‌లతో చెలరేగాడు. అతడికి రూథర్‌పోర్డ్‌ నుంచి సంపూర్ణ సహకారం అందింది. 

ఈ జంట నాలుగో వికెట్‌కు 54 బంతుల్లోనే 120 పరుగులు జోడించడంతో మ్యాచ్‌ భారత్‌ చేజారింది. ఆఖర్లో రొమారియో షెఫర్డ్‌ కూడా పిడుగుల్లాంటి షాట్‌లతో విజృంభించగా... హోప్‌ భారీ సిక్సర్‌తో తన సెంచరీతో పాటు గెలుపు లాంఛనాన్ని ముగించాడు. కరీబియన్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 20 సిక్స్‌లు, 21 ఫోర్లు నమోదయ్యాయి. కేవలం బౌండరీల ద్వారానే ఆ జట్టు 204 పరుగులు పిండుకోవడం గమనార్హం.  

250 సరిపోలేదు... 
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌... ఇన్నింగ్స్‌ ముగిసేసరికి భారీ స్కోరు సాధించామనే ఆత్మవిశ్వాసంలో కనిపించింది. అయితే పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌పై ఇంకా తక్కువ పరుగులే చేశామని ఆ తర్వాత తెలిసొచ్చింది. కొన్ని చక్కటి షాట్‌లు ఆడిన అభిషేక్‌ (20; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయినా... ఇషాన్‌ కిషన్‌తో కలిసి సామ్సన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించిన ఈ జంట రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించింది. ఈ క్రమంలో సామ్సన్‌ 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

ఇషాన్‌ అవుటైన తర్వాత గత మ్యాచ్‌ సెంచరీ హీరో, కెప్టెన్‌ శ్రేయస్‌కు బదులు శివమ్‌ దూబేను బ్యాటింగ్‌కు పంపడం టీమిండియా కొంపముంచింది. షాట్‌లు ఆడేందుకు ఇబ్బంది పడ్డ అతడు 10 బంతులాడి 7 పరుగులే చేసి వెనుదిరిగాడు. దీంతో సామ్సన్‌ కూడా నెమ్మదించగా... మధ్య ఓవర్లలో పరుగుల వేగం బాగా తగ్గింది. చివర్లో శ్రేయస్, తిలక్‌ ధనాధన్‌ షాట్‌లతో రెచ్చిపోవడంతో వెస్టిండీస్‌పై భారత్‌ తమ అత్యధిక స్కోరు నమోదు చేయగలిగింది. వీరిద్దరు 32 బంతుల్లో 83 పరుగులు జోడించారు.    

2 అంతర్జాతీయ టి20ల్లో ఇది (250) రెండో అతిపెద్ద ఛేదన. 2023లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా జట్టు 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) మోతీ (బి) చేజ్‌ 20; సామ్సన్‌ (సి) పూరన్‌ (బి) స్ప్రింగర్‌ 82; ఇషాన్‌ (బి) చేజ్‌ 43; శివమ్‌ దూబే (బి) చేజ్‌ 7; శ్రేయస్‌ (సి) హెట్‌మైర్‌ (బి) స్ప్రింగర్‌ 40; తిలక్‌ (నాటౌట్‌) 44; నమన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 249. వికెట్ల పతనం: 1–42, 2–139, 3–158, 4–162, 5–245. బౌలింగ్‌: అకీల్‌ 3–0–46–0; షెఫర్డ్‌ 3.4–0–47–0; చేజ్‌ 4–0–24–3; మోతీ 2–0–21–0; షమార్‌ జోసెఫ్‌ 3–0–39–0; స్ప్రింగర్‌ 4–0–64–2; పావెల్‌ 0.2–0–7–0.  

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హోప్‌ (నాటౌట్‌) 102; కమిల్‌ (సి) (సబ్‌) బిష్ణోయ్‌ (బి) మయాంక్‌ 4; హెట్‌మైర్‌ (బి) మయాంక్‌ 0; పావెల్‌ (బి) మయాంక్‌ 24; రూథర్‌ఫోర్డ్‌ (సి) సామ్సన్‌ (బి) కుల్దీప్‌ 84; షెఫర్డ్‌ (నాటౌట్‌) 34; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–58, 4–178. బౌలింగ్‌: మయాంక్‌ యాదవ్‌ 3–0–36–3; అర్ష్ దీప్ 4–0–45–0; అక్షర్‌ 3.3–0–63–0;  దూబే 2–0–30–0; కుల్దీప్‌ 4–0–53–1; నమన్‌ ధీర్‌ 2–0–25–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement