భారత్‌కు మళ్లీ పరాజయమే... | India lose first match against Australia in FIH Pro League | Sakshi
Sakshi News home page

భారత్‌కు మళ్లీ పరాజయమే...

Jun 15 2025 1:27 AM | Updated on Jun 15 2025 1:27 AM

India lose first match against Australia in FIH Pro League

2–3తో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి 

యూరోప్‌ అంచెలో వరుసగా ఐదో పరాభవం

అంట్‌వర్ప్‌ (బెల్జియం): ప్రత్యర్థులు మారుతున్నా... భారత్‌ ఫలితాలే మారడం లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌ యూరోప్‌ అంచె పోటీల్లో భారత సీనియర్‌ పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసలో ఐదో ఓటమిని చవిచూసిన భారత్‌... మూడో ప్రత్యర్థి చేతిలోనూ చిత్తయ్యింది. నెదర్లాండ్స్, అర్జెంటీనాల చేతిల్లో కంగుతిన్న భారత్‌... తాజాగా ఆస్ట్రేలియా ధాటికి తలవంచింది. శనివారం ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 2–3 స్కోరు తేడాతో ఐరోపాలో అలవాటైన అపజయాన్ని మూటగట్టుకుంది. 

భారత్‌ తరఫున అభిషేక్‌ 8, 35వ నిమిషాల్లో రెండు గోల్స్‌ సాధించాడు. కంగారూ జట్టులో నాథన్‌ ఎఫ్రామస్‌ (42వ ని.), జోయెల్‌ రింటాల (56వ ని.), టామ్‌ క్రెయిగ్‌ (60వ ని.) తలా ఒక గోల్‌ చేశారు.నిజానికి ఈ ప్రొ లీగ్‌ హాకీలో మెరుగైన స్థానంతోనే నేరుగా వచ్చే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనుకున్న భారత్‌కు వరుస పరాభవ ఫలితాలు శరాఘాతమయ్యాయి. యూరోప్‌ లెగ్‌లో మొదట నెదర్లాండ్స్‌తో... తర్వాత అర్జెంటీనాతో ఆడిన రెండేసి చొప్పున ఆడిన మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడింది. 

రెండు క్వార్టర్లు ఆధిక్యంలో ఉన్నా... 
ఆరంభంలో భారత్‌ దూకుడు కనబరిచింది. పది నిమిషాల్లోనే ప్రత్యర్థిపై ఆధిక్యత సాధించింది. ఆటగాళ్ల సమన్వయం, డిఫెండర్ల పట్టు... ఇలా ఇన్ని అనుకూలతలున్నప్పటికీ అన్నీ ఆరంభశూరత్వంగానే ఆవిరయ్యాయి. తొలి క్వార్టర్‌ 8వ నిమిషంలోనే అభిషేక్‌ గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్‌లో మరో గోల్‌ సాధించలేకపోయినప్పటికీ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో డిఫెండర్లు, స్ట్రయికర్లు సమష్టిగా శ్రమించారు. 

మూడో క్వార్టర్‌ మొదలైన ఐదు నిమిషాలకే అభిషేక్‌ మరో గోల్‌ భారత్‌ ఆధిక్యం కాస్తా 2–0కు పెరిగింది. ఇలా దాదాపు 41 నిమిషం దాకా కొనసాగిన భారత ఆధిపత్యానికి ఆ మరుసటి నిమిషంలోనే నాథన్‌ ఎఫ్రామస్‌ గండి కొట్టాడు. 2–1తో అప్పటికి మంచిస్థితిలోనే ఉంది. అయితే ఆఖరి క్వార్టర్‌ కూడా ముగిసే దశలో ఆసీస్‌కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లు భారత్‌ను నిండా ముంచేశాయి. 4 నిమిషాల వ్యవధిలో రింటాల (56వ ని.), క్రెయిగ్‌ (60వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంతో భారత్‌కు మరో పరాజయం తప్పలేదు. నేడు ఇదే వేదికపై భారత్‌... ఆసీస్‌తో రెండో మ్యాచ్‌ ఆడుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement