
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్ చేసినట్లు తెలుస్తుంది. టోర్నీలో భాగంగా రేపు (జులై 31) సాయంత్రం 5 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
అయితే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లంతా మూకుమ్మడిగా ఈ మ్యాచ్‌ను బహిష్కరించారని సమాచారం. దీంతో పాకిస్తాన్ ఫైనల్‌కు క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోనూ భారత్ ఇదే కారణంగా పాక్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంది. అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
భారత్ సెమీస్‌కు చేరిందిలా..!
పాక్‌తో లీగ్ దశలో మ్యాచ్‌ను రద్దు చేసుకున్న భారత్.. ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొని సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్‌లో తుది బెర్త్ దక్కించుకుంది.
అయితే అప్పటికే పాకిస్తాన్ వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో సెమీస్‌లోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనివార్యమైంది. ఒకవేళ లీగ్ దశలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసినా ఫైనల్‌లో అయినా పాక్‌తో పోరు తప్పేది కాదు.
మరోపక్క పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతుంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు బర్మింగ్హమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సి ఉంది.
దేశమే ముఖ్యం
పాక్‌తో సెమీస్ మ్యాచ్ రద్దు చేసుకోవాలని భారత ఆటగాళ్లు నిర్ణయించుకోకముందే టోర్నీ ప్రధాన స్పాన్సర్ 'ఈజ్‌మైట్రిప్' నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. భారత్, పాక్ మ్యాచ్‌కు తాము స్పాన్సర్‌గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.
‘డబ్ల్యూసీఎల్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది. అయితే, పాకిస్తాన్‌తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు అండగా ఉండలేము.
కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లతో డబ్ల్యూసీఎల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.