భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని తాకాడు. ఆసియా ఖండంలో 7000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్‌ను సాధించాడు. రోహిత్‌కు ముందు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే ఆసియాలో 7000 వన్డే పరుగుల మైలురాయిని తాకారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో అద్బుత విజయం సాధించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో చుక్కెదురైంది. పర్యాటక న్యూజిలాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్‌వెల్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్‌కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్‌ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా, ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది.


