చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌ | IND vs ENG Harmanpreet Kaur Creates History Breaks All Time World Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌

Jun 3 2026 12:42 PM | Updated on Jun 3 2026 12:50 PM

IND vs ENG Harmanpreet Kaur Creates History Breaks All Time World Record

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఇంత వరకు ఏ ప్లేయర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. టీమిండియా తరఫున 2009లో అరంగేట్రం చేసింది హర్మన్‌.

అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్‌ స్థాయికి చేరుకున్న హర్మన్‌.. మహిళా క్రికెట్‌లో భారత్‌కు మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్‌ అందించింది. స్వదేశంలో గతేడాది జరిగిన మెగా టోర్నీలో జట్టును చాంపియన్‌గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరింది.

ఇంగ్లండ్‌ పర్యటనలో..
ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్న 37 ఏళ్ల హర్మన్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టు తొలి టీ20కి దూరమైన ఆమె.. రెండో మ్యాచ్‌ నుంచి జట్టుతో చేరింది. అయితే, హర్మన్‌ సారథ్యంలో రెండో టీ20తో పాటు.. తాజాగా మూడో టీ20లోనూ ఓటమిపాలైంది.

సిరీస్‌ ఇంగ్లండ్‌దే
టాంటన్‌ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్‌ కేవలం 18.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ 40 బంతులు ఎదుర్కొని 56 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌
కాగా హర్మన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 368వ మ్యాచ్‌. తద్వారా మహిళల క్రికెట్‌లో అత్యధిక ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్‌ ప్రపంచ రికార్డు సాధించింది. కాగా గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ స్టార్‌ సుజీ బేట్స్‌ పేరిట ఉండేది. ఆమె తన కెరీర్‌లో 367 మ్యాచ్‌లు ఆడింది.

ఇక టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత సుజీ బేట్స్‌ రిటైర్‌ కానుండగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రిటైర్మెంట్‌ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. తద్వారా మరికొన్ని మ్యాచ్‌లలో పాల్గొని.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్‌ తన పేరును సుస్థిరం చేసుకునే అవకాశం లేకపోలేదు.

మహిళల క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు
🏏హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (భారత్‌)- 368
🏏సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌)- 367
🏏ఎలిస్‌ పెర్రీ (ఆస్ట్రేలియా)- 357
🏏మిథాలీ రాజ్‌ (భారత్‌)- 333
🏏సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)- 313.

చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్‌.. భువీ రీఎంట్రీ!

Advertisement
 
Advertisement
Advertisement