భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుందన్న ఓ వార్త ఇవాళ (జూన్ 2) సోషల్‌మీడియాలో వైరలైంది. ఈ సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరుగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రక సిరీస్‌లో భారత జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.
ఈ సిరీస్ కోసం ఐపీఎల్ స్టార్లకు అధిక అవకాశాలు ఇవ్వవొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. వీరిద్దరూ ఇటీవలికాలంలో కెప్టెన్సీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించడంతో పాటు వ్యక్తిగతంగానూ విశేషంగా రాణించారు.
ఐపీఎల్ 2026 పెను సంచలనం, రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్‌లకు కూడా ఈ జట్టులో చోటు ఖాయమని అనుకుంటున్నారు.
మిడిలార్డర్‌లో ఆర్సీబీకి రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్ అశుతోష్ శర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఆల్‌రౌండర్లుగా ఆర్సీబీ సంచలనాలు కృనాల్ పాండ్యా, రసిక్ సలాం దార్‌కు చోటు దక్కవచ్చని అంచనా.
బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు అందరి నోటా వినిపిస్తుంది. ఈ సిరీస్‌తో అతడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిగతా పేసర్లుగా సీఎస్‌కే అన్షుల్ కంబోజ్, కేకేఆర్ కార్తీక్ త్యాగి, లక్నో ప్రిన్స్ యాదవ్‌లకు అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్పిన్ బాధ్యతలు రవి బిష్ణోయ్‌కు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది.
అంచనా భారత జట్టు:
వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రజత్ పాటిదార్, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), నమన్ ధిర్, ఆశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్, అన్షుల్ కంబోజ్, కార్తిక్ త్యాగి, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్.
ఇదిలా ఉంటే, ఈ జట్టు అధికారిక జట్టు కాదు. ఐపీఎల్ ప్రదర్శనలు, ప్రస్తుత ఫామ్, జట్టు అవసరాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన అంచనా జట్టు మాత్రమే. ఈ సిరీస్‌పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా లేదు. ఇది కేవలం సోషల్‌మీడియాలో ప్రచారం మాత్రమే.
ఈ సిరీస్ విషయాన్ని పక్కన పెడితే.. జూన్ 6 నుంచి భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు.


