
జురెల్, సిరాజ్- కొన్‌స్టాస్ (పాత ఫొటోలు)
భారత్-‘ఎ’- ఆస్ట్రేలియా-‘ఎ’ జట్ల (IND A vs AUS A) మధ్య మంగళవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. లక్నోలోని భారత రత్ర శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టు నుంచి వైదొలగడంతో అతడి స్థానంలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) సారథిగా బాధ్యతలు చేపట్టాడు.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా సీనియర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ కూడా ఆసీస్-‘ఎ’తో మ్యాచ్‌లో బరిలోకి దిగారు. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఆదిలోనే షాక్
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు.. పేసర్ ప్రసిద్ కృష్ణ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కాంప్‌బెల్ కెల్లావేను తొమ్మిది పరుగులకే పరిమితం చేశాడు. ప్రసిద్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కెల్లావే సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అయితే, మరో ఓపెనర్, తొలి టెస్టులో సెంచరీ బాదిన సామ్ కొన్‌స్టాస్ మాత్రం క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలకు చేరువైన వేళ.. ఈ జంటను విడదీయడానికి భారత బౌలర్లు ప్రయత్నించారు.
కొన్‌స్టాస్‌ను అవుట్ చేసిన సిరాజ్
ఈ నేపథ్యంలో భోజన విరామ సమయం తర్వాత సిరాజ్ ఈ ప్రయత్నంలో సఫలమయ్యాడు. అర్ధ శతకానికి ఒక పరుగు దూరంలో ఉన్నవేళ కొన్‌స్టాస్‌ను అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా కొన్‌స్టాస్ వెనుదిరిగాడు. మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఏడు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు.
తొలి టెస్టులో ఇరగదీసిన ఇరు జట్ల బ్యాటర్లు
కాగా భారత్‌తో తొలి అనధికారిక టెస్టులో సామ్ కొన్‌స్టాస్ సెంచరీ (109) చేసిన విషయం తెలిసిందే. ఇక మరో ఓపెనర్ కాంప్‌బెల్ కెల్లావే (88), ఆల్‌రౌండర్ కూపర్ కన్నోలి (70), లియామ్ స్కాట్ (81) హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ అజేయ శతకం (123)తో దుమ్ములేపాడు. దీంతో 98 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఇందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. నారాయణ్ జగదీశన్ (64), సాయి సుదర్శన్ (73) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. దేవ్‌దత్ పడిక్కల్ (150), ధ్రువ్ జురెల్ (140) భారీ శతకాలతో చెలరేగారు. ఈ క్రమంలో 141.1 ఓవర్ల వద్ద ఏడు వికెట్ల నష్టానికి 531 పరుగులు చేసి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే, ఆ తర్వాత చివరి రోజు వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగించింది. అప్పటికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలలేదు. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆసీస్ కెప్టెన్ అర్ధ శతకం
ఇక రెండో అనధికారిక టెస్టులో తొలిరోజు 42 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ (49) ఫర్వాలేదనిపించగా.. కాంప్‌బెల్ కెల్లావే (9) నిరాశపరిచాడు. కెప్టెన్ మెక్‌స్వీనీ అర్ధ శతకం (50), ఓలీవర్ పీక్ 25 పరుగులతో క్రీజులో నిలిచారు.
చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. కారణం?