
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్ కనబరుస్తున్న ఈ హైదరాబాదీ బౌలర్‌లో కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు. ఈ క్రమంలో మూడు స్థానాలు ఎగబాకి పన్నెండో ర్యాంకుకు చేరుకున్నాడు.
అగ్రస్థానం బుమ్రాదే
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు ర్యాంకింగ్స్ ((ICC) Latest Test Rankings)ను బుధవారం ప్రకటించింది. బౌలర్ల విభాగంలో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కగిసో రబడ, మ్యాట్ హెన్రీ, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ టాప్-5లో కొనసాగుతున్నారు.
సిరాజ్ కెరీర్‌లో అత్యుత్తమంగా
ఆ తర్వాతి స్థానాల్లో నొమన్ అలీ, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్, మార్కో యాన్సెన్, మిచెల్ స్టార్క్, గస్ అట్కిన్సన్ కొనసాగుతుండగా.. జేడన్ సీల్స్, ప్రభాత్ జయసూర్య, షమాన్ జోసెఫ్‌లను వెనక్కి నెట్టి సిరాజ్ పన్నెండో స్థానానికి దూసుకువచ్చాడు. కెరీర్‌లో అత్యుత్తమంగా 718 రేటింగ్ పాయింట్లు సాధించాడు.
ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు తీసిన సిరాజ్.. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో తొలి టెస్టులోనూ ఫామ్ కొనసాగించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఏడు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలోనే కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించాడు.
రూట్.. రైట్ రైట్
మరోవైపు.. ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ టాప్ ర్యాంకులో కొనసాగుతుండగా.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారి టాప్-5లో చోటు కోల్పోయాడు. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఐదో స్థానంలోకి రాగా.. శ్రీలంక స్టార్ కమిందు మెండిస్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.
దిగజారిన జైసూ ర్యాంకు
ఇక జైస్వాల్ ఐదో ర్యాంకు నుంచి ఏడుకు పడిపోయాడు. అయితే, టీమిండియా మరో స్టార్ రిషభ్ పంత్ మాత్రం తన ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గాయం కారణంగా రిషభ్ ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు, విండీస్‌తో తొలి టెస్టుకు దూరమైనా తన ర్యాంకును నిలబెట్టుకోగా.. వెస్టిండీస్‌తో మొదటి టెస్టులో విఫలమైన జైసూ (36) ఈ మేరకు చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.
టాప్‌లోనే జడ్డూ
అదే విధంగా.. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు స్థానాలు ఎగబాకి పదకొండో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా విండీస్ తొలి టెస్టులో అజేయ శతకం (104) బాదిన జడ్డూ.. నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన