
టెస్టుల్లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించాడు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal). వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా ముచ్చటగా మూడోది పూర్తి చేస్తాడనుకుంటే ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు.
25 పరుగుల దూరంలో
ఢిల్లీలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. అనవసరపు పరుగు కోసం యత్నించి జైసూ మూల్యం చెల్లించాడు. 175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయి డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.
జేడన్ సీల్స్ (Jayden Seales) బౌలింగ్‌లో బంతిని మిడాఫ్ దిశగా జైసూ బంతిని బాదగా.. అది నేరుగా ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. అయితే అప్పటికే పరుగు కోసం క్రీజు వీడిన జైస్వాల్.. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు పిలుపునిచ్చాడు. కానీ ఫీల్డర్ చేతికి బంతి చిక్కడంతో జాగ్రత్త పడ్డ గిల్ కాస్త ముందుకు కదిలినా మళ్లీ తన స్థానంలోకి వచ్చేశాడు.
గిల్‌కు మద్దతుగా కుంబ్లే
ఇంతలో జైసూ వెనక్కి పరిగెత్తగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో జైసూ- గిల్ తీరుపై విమర్శలు వస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం గిల్‌కు మద్దతుగా నిలిచాడు. స్వీయ తప్పిదంతోనే జైస్వాల్ వికెట్ పారేసుకున్నాడని అభిప్రాయపడ్డాడు.
‘‘ఇదొక ఊహించని పరిణామం. జైస్వాల్ వంటి ప్రతిభావంతమైన ఆటగాడు ఇలా చేస్తాడని ఎవరైనా అనుకుంటారా?.. తన షాట్ బాగానే ఆడానని జైస్వాల్ భావించి ఉంటాడు. ఏదేమైనా పరుగుకోసం వెళ్లాలనేది జైస్వాల్ నిర్ణయం.
తప్పంతా అతడిదే
ఇందులో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆటగాడి (గిల్) తప్పేమీ లేదు. ఎందుకంటే జైసూ మిడాఫ్ ఫీల్డర్‌కు నేరుగా బంతిని అందించినట్లయింది. ఆ సమయంలో పరుగుకు తీయడానికి అసలు అవకాశమే లేదు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో కుంబ్లే పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. రెండో రోజు ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. గిల్ 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు.
చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!