
పురుషుల హండ్రెడ్ లీగ్‌లో కావ్యా మారన్ జట్టు నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ సంచలన విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (ఆగస్ట్ 13) సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి గెలుపొందింది. గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో గ్రహం క్లార్క్ నమ్మశక్యం కాని రీతిలో సిక్సర్ బాది సూపర్ ఛార్జర్స్‌ను గెలిపించాడు. తైమాల్ మిల్స్ వేసిన స్లో డెలివరీని క్లార్క్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు.
ఈ సిక్సర్‌తో ప్రత్యర్థి హోం గ్రౌండ్ ఒక్కసారిగా మూగబోయింది. మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఈ ఓటమితో సథరన్ బ్రేవ్ వరుసగా విజయాలకు బ్రేక్ పడింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. లారీ ఇవాన్స్ (53), జేమ్స్ కోల్స్ (49 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో జేకబ్ డఫీ 3, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ ఛార్జర్స్.. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ గెలుపు కష్టమన్నట్లు సాగింది. అయితే గ్రహం క్లార్క్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కీలక తరుణంలో 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 38 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి మిచెల్ సాంట్నర్ (24) సహకరించాడు.
అంతకుముందు జాక్ క్రాలే (29), హ్యారీ బ్రూక్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేసి సూపర్ ఛార్జర్స్‌ను మ్యాచ్‌లో ఉంచారు. బ్రేవ్ బౌలర్లలో ఓవర్టన్ 3, జోఫ్రా ఆర్చర్, తైమాల్ మిల్స్ తలో 2 వికెట్లు తీశారు.