
పురుషుల హండ్రెడ్ లీగ్ 2025లో కావ్యా మారన్ జట్టు నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ తొలి ఓటమిని ఎదుర్కొంది. నిన్న (ఆగస్ట్ 10) ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది.
కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45), గ్రహం క్లార్క్ (36) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో సూపర్ ఛార్జర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ఆటగాళ్లలో మాథ్యూ పాట్స్ (12 నాటౌట్), మొహమ్మద్ ఆమిర్ (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
జాక్ క్రాలే (2), డేవిడ్ మలాన్ (4), మైఖేల్ పెప్పర్ (6), డాన్ లారెన్స్ (2), ఇమాద్ వసీం (0), టామ్ లాస్ (4), ఆదిల్ రషీద్ (0) దారుణంగా విఫలమయ్యారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో అకీల్ హొసేన్, సామ్ కుక్, రెహాన్ అహ్మద్, మార్కస్ స్టోయినిస్ తలో 2 వికెట్లు తీయగా.. ఫెర్గూసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన రాకెట్స్ 96 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామ్ బాంటన్ (37), రెహాన్ అహ్మద్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేసి రాకెట్స్‌ను గెలిపించారు. మిగతా ఆటగాళ్లలో జో రూట్ 20, మ్యాక్స్ హోల్డన్ 8, మార్కస్ స్టోయినిస్ 8 (నాటౌట్), ఆడమ్ హోస్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో ఇమాద్ వసీం 3, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు.
ఈ సీజన్‌లో సూపర్ ఛార్జర్స్ తమ తొలి మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. కాగా, ఈ సీజన్‌కు ముందే కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌లోని మొత్తం వాటాను కొనుగోలు చేసింది. ఈ జట్టుతో పాటు హండ్రెడ్ లీగ్‌లోని మరో మూడు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.