
లండన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో చివరి బ్యాటర్ ఔటైనపుడు ఎలా అనిపించిందని బ్రిటన్ రాజు చార్లెస్-3 టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ప్రశ్నించారు. మంగళవారం లండన్‌లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్‌లో కింగ్ చార్లెస్... భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో ముచ్చటించారు.
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. టాపార్డర్ ఆకట్టుకోలేకపోయినా... ఆఖర్లో టెయిలెండర్లు అద్భుతంగా పోరాడటంతో ఒకదశలో భారత జట్టు విజయం సాధిస్తుందనిపించింది.
కానీ హైదరాబాదీ సిరాజ్ చివరి వికెట్ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. బషీర్ వేసిన బంతిని సిరాజ్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా... బంతి నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.
భారత జట్లకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా కింగ్ చార్లెస్ దీని గురించి భారత సారథితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లండ్‌లో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి, డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు పాల్గొన్నారు.
కింగ్ చార్లెస్‌తో భేటీ అనంతరం దానికి సంబంధించిన అంశాలను గిల్ పంచుకున్నాడు.‘కింగ్ చార్లెస్‌తో కలవడం చాలా బాగుంది. ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడారు. మూడో టెస్టులో చివరి బ్యాట్స్‌మన్ ఔట్ అయిన విధానం చాలా దురదృష్టకరమని అన్నారు.
అనుకోకుండా బంతి వికెట్ల మీదకు వెళ్లిందన్నారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించారు. అది దురదృష్టకరమని... సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తామని కింగ్ చార్లెస్‌కు చెప్పాం.
ఇంగ్లండ్‌లో ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా మాకు విశేష ఆదరణ దక్కుతుంది. అందుకు తగ్గట్లే జట్టు కూడా విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తోంది. సిరీస్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. మూడు మ్యాచ్‌లూ ప్రేక్షకులను అలరించాయి. టెస్టు మ్యాచ్ చివరి రోజు చివరి సెషన్‌లో ఒక జట్టు స్వల్ప తేడాతో మాత్రమే ఓడిందంటే... ఆ మ్యాచ్‌లో ‘క్రికెట్’ గెలిచినట్లే’ అని గిల్ అన్నాడు.
ఇక భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కింగ్ చార్లెస్ ప్రయాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కింగ్‌తో భేటీ అనంతరం నాలుగో టెస్టు కోసం పురుషుల జట్టు మాంచెస్టర్‌కు బయలుదేరగా... మహిళల జట్టు వన్డే సిరీస్ కోసం సౌతాంప్టన్‌కు తిరుగు పయనమైంది.