భారత మహిళల క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. పదేళ్లకు పైగా జట్టును ముందుకు నడిపించి.. మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికింది. భారత మహిళా క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అయితే, ప్లేయర్‌గా మాత్రం జట్టులో కొనసాగుతానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చేసిన సేవల్ని తలచుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో.. హర్మన్ మరికొన్నాళ్లు కెప్టెన్‌గా ఉండాలని భావించినా.. యాజమాన్యం మాత్రం ఇందుకు అంగీకరించలేదనే ఆరోపణలు చేస్తున్నారు.
బీసీసీఐ ఆఫర్
ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ ఓ ఆసక్తికర కథనాన్ని తెరమీదకు తెచ్చింది. కాగా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, హెడ్‌కోచ్‌గా అమోల్ మజుందార్ భవితవ్యాన్ని తేల్చేందుకు బీసీసీఐ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసింది. హర్మన్‌తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, అమోల్ మజుందార్‌లతో పాటు బోర్డు పెద్దలు పాల్గొన్నారు.
తిరస్కరించిన హర్మన్!
చర్చల్లో భాగంగా హర్మన్‌ను ఏదో ఒక ఫార్మాట్‌కు సారథిగా కొనసాగమని బీసీసీఐ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. వన్డేల్లో ఆమె మరికొంతకాలం కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని బోర్డు భావించినట్లు తెలుస్తోంది. అయితే, హర్మన్ మాత్రం తాను ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఉంటానని.. ఏ ఒక్క ఫార్మాట్‌కో పరిమితం కానని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆఖరికి బీసీసీఐ ఆఫర్ కాదనుకున్న హర్మన్.. మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా వైదొలిగినట్లు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన భారత మహిళల జట్టు పగ్గాలు చేపట్టడం లాంఛనమే కానుంది.
మేటి సారథి
కెప్టెన్‌గా, ప్లేయర్‌గా హర్మన్‌కు మంచి రికార్డు ఉంది. ఇంత వరకు ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో 211 మ్యాచ్‌లు ఆడింది. 155 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో సారథ్యం వహించింది. హర్మన్ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్-2020 ఫైనల్‌కు చేరుకుంది. కామన్‌వెల్త్ గేమ్స్-2022లో రజతం గెలిచింది.
అదే విధంగా.. 37 ఏళ్ల హర్మన్ నాయకత్వంలోనే ఆసియా టీ20 కప్ 2016, 2022, 2026 ఎడిషన్లలో టైటిళ్లు గెలిచింది. ఆసియా క్రీడలు-2023, ఆసియా క్రీడలు-2026 టోర్నీలో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. ఇక గతేడాది సొంతడ్డపై తొలిసారి మహిళల ప్రపంచకప్ ట్రోఫీని భారత్ ముద్దాడింది.
చదవండి: నాశనం చేస్తున్నారు: గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ ఫైర్


