ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ భయంకర పేలుడులో మొత్తం 13 మంది మృతి చెందగా..17 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని గంభీర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గంబీర్ ప్రస్తుతం భారత జట్టుతో పాటు కోల్‌కతాలో ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
భద్రతా వలయంలో ఈడెన్..
కాగా ఢిల్లీ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీస్‌లు అలర్ట్ అయ్యారు. మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తొలి టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నాయి. దీంతో ఆటగాళ్లు బస చేసే హోటల్స్ వద్ద, స్టేడియంకి వెళ్లే మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. సోమవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ చుట్టూ పోలీసులు ప్రత్యేక నాకా తనిఖీలు (NAKA checks) చేశారు.


