ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేసిన సంగతి తెలిసిందే. కంగారులతో వన్డే, టీ20 సిరీస్‌లకు రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. కేవలం నెటిజన్లే కాదు కృష్ణమాచారి శ్రీకాంత్, అశ్విన్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం హర్షిత్‌ను టార్గెట్ చేశారు.
రాణాకు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ ఉందని, అందుకే ప్రతీ సిరీస్‌లోనూ అతడికి చోటు దక్కుతుందని శ్రీకాంత్ ఆరోపించాడు. అయితే హర్షిత్‌ను ట్రోల్ చేస్తున్న వారిపై గంభీర్ మండిపడ్డాడు. అతడిని కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేశామని, మీ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం యువ ఆటగాడిని విమర్శించడం అపండి అంటూ గౌతీ ఫైరయ్యాడు.
అయితే గంభీర్ నమ్మకాన్ని మాత్రం రాణా నిలబెట్టుకున్నాడు. తన అద్బుత ప్రదర్శనలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. వన్డే, టీ20 సిరీస్‌లలో ఆల్‌రౌండ్ షోతో రాణా అదరగొట్టాడు. రాణా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో మళ్లీ ట్రోలర్స్ అతడిని టార్గెట్ చేసే అవకాశముంది.
ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాకు కేకేఆర్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ మన్విందర్ బిస్లా సపోర్ట్‌గా నిలిచాడు. రాణా తన ప్రతిభ ఆధారంగానే జట్టులోకి వచ్చాడని, గంభీర్ ఏమి అతడికి బంధువు కాదని బిస్లా అన్నాడు. "హర్షిత్ రాణాను వ్యతిరేకిస్తున్న వారు కచ్చితంగా వారు కేకేఆర్ అభిమానులు కానివారై ఉండాలి.
అవును గౌతమ్ గంభీర్‌కు కేకేఆర్‌తో మంచి అనుబంధం. అతడు గతంలో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా, మెంటార్‌గా తన సేవలను అందించాడు. హర్షిత్ రాణా కూడా కేకేఆర్‌లో ఉన్నందున గంభీర్ సపోర్ట్ చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. గౌతీ అతడికి మామ లేదా బాబాయ్ వంటి బంధువు కాదు కాదా. అవన్నీ వట్టి రూమర్సే. ఇకనైనా అతడిని ట్రోల్ చేయడం ఆపండి అని" బిస్లా ఇండియా క్రికెట్ క్యాంటీన్ పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.
చదవండి: భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్


