ఆ్రస్టేలియా, భారత్ చివరి టి20కి వర్షం దెబ్బ
సిరీస్ గెలుచుకున్న టీమిండియా
బ్రిస్బేన్: వర్షంతో మొదలైన భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్ చివరకు వర్షంతోనే ముగిసింది. శనివారం ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టి20 మ్యాచ్ వాన కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన వర్షం ఎంతకీ తగ్గలేదు. దాంతో చివరకు ఆటను అంపైర్లు రద్దు చేయక తప్పలేదు.
ఆడింది 29 బంతులే అయినా ఓపెనర్లు అభిషేక్ శర్మ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (16 బంతుల్లో 29 నాటౌట్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో అభిషేక్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి ఓవర్లోనే 5 పరుగుల వద్ద అతను ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ వదిలేయగా, 11 పరుగుల వద్ద మరో క్యాచ్‌ను డ్వార్‌షుయిస్ అందుకోలేకపోయాడు.
మరో వైపు డ్వార్‌షుయిస్ ఓవర్లోనే 4 ఫోర్లు బాది గిల్ ధాటిని చూపించాడు. 161.38 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 163 పరుగులు చేసిన అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ తొలి మ్యాచ్ రద్దు కాగా, మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో పోరులో ఆసీస్ గెలిచింది. ఆ తర్వాత హోబర్ట్, కరారాలలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పైచేయి సాధించిన భారత్ చివరకు 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. భారత్ తమ తర్వాతి పోరులో సొంతగడ్డపై నవంబర్ 14 నుంచి జరిగే టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగనుండగా... నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్‌తో ‘యాషెస్’లో ఆసీస్ తలపడుతుంది.
‘ఆ్రస్టేలియా పర్యటన కోసం చాలా కాలంగా ఎదురు చూశాను. ఇక్కడ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. మేం మరింత భారీ స్కోర్లు సాధించాల్సింది. అయితే జట్టు సిరీస్ గెలవడం ముఖ్యం. టీమ్ మేనేజ్‌మెంట్ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. నేను వరుసగా 15 మ్యాచ్‌లలో డకౌట్ అయినా నా స్థానానికి ఢోకా ఉండదని చెప్పింది. అందుకే తొలి బంతినుంచే ధైర్యంగా, దూకుడుగా ఆడగలుగుతున్నా. తొలిసారి టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా’ –అభిషేక్ శర్మ, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్
‘తొలి మ్యాచ్ ఓడిన తర్వాత కోలుకొని గెలిపించిన జట్టు సభ్యులకు అభినందనలు. ప్రతీ ఒక్కరికి తమ బాధ్యతపై స్పష్టత ఉంది. పేసర్లు, స్పిన్నర్లు అంతా సమష్టిగా రాణించారు. దాని వల్లే మేం అనుకున్న ప్రణాళికలను సమర్థంగా అమలు చేయగలిగాం. ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉన్న ఎంతో మంది ప్లేయర్లు మా జట్టులో ఉండటం చాలా మంచి విషయం.
వరల్డ్ కప్‌కు ముందు ఉన్న 2–3 సిరీస్‌లు సన్నాహకంగా ఉపయోగపడతాయి. జట్టులోని ప్రతీ ఒక్కరికి తమదైన ప్రత్యేక ప్రతిభ ఉండటం కెపె్టన్‌గా నా అదృష్టం. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గత కొన్ని నెలలుగా మంచి ఫలితాలు సాధించగలిగాం. ఎలాంటి లోపాలు లేవని చెప్పను. ఎందుకంటే నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది’ –సూర్యకుమార్ యాదవ్, భారత కెప్టెన్
528 ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో అత్యంత వేగంగా (528 బంతుల్లో) 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు.


