ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా రెండో విజయంపై కన్నేసింది. గ్రూప్-జెలో ఇవాళ రాత్రి ఆస్ట్రియాతో అర్జెంటీనా తలపడుతోంది. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. అల్జీరియాతో జరిగిన మ్యాచ్ మెస్సీకి 200వది కావడం గమనార్హం. తన 200వ మ్యాచ్‌ను అద్భుతంగా మలుచుకున్నాడు. అల్జీరియాతో మ్యాచ్‌లో పలు రికార్డు లను బద్దలు కొట్టిన మెస్సీ ఆస్ట్రియాతో మ్యాచ్‌లోనూ పలు రికార్డులు సవరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకసారి వాటిని పరిశీలించి చూద్దాం.
👉38 ఏళ్ల మెస్సీ వరుసగా ఐదు ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ చేశాడు. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ఆడుతున్న మెస్సీ మరొక గోల్ చేస్తే, వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో గోల్స్ చేసిన ఆటగాళ్ల సరసన చేరనున్నాడు. గతంలో ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్ ఫోంటైన్, బ్రెజిల్‌కు చెందిన జైర్జిన్హో సంయుక్తంగా ఆరు ప్రపంచకప్పుల్లో ఆరు గోల్స్ చేశారు. ఆల్ టైమ్ రికార్డు అందుకోవడానికి మెస్సీ మరొక గోల్ చేస్తే సరిపోతుంది.
👉ఆస్ట్రియాతో మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొడితే ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం మెస్సీ 16 గోల్స్‌తో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్‌తో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్‌లో ఒక్క గోల్ చేసినా మెస్సీ ప్రపంచ రికార్డు సాధించినట్లే.
👉ఆస్ట్రియాపై అర్జెంటీనా విజయం సాధిస్తే మెస్సీకి మరో చారిత్రాత్మకం కానుంది. ఇప్పటివరకు 16 ఫిఫా మ్యాచ్‌లు గెలిచిన మెస్సీ, ఇవాళ ఆస్ట్రియాపై గెలుపుతో 17 విజయాలతో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్ రికార్డు సమం చేసే అవకాశముంది.
👉అల్జీరియాతో మ్యాచ్‌లో మెస్సీ 38 సంవత్సరాల 357 రోజుల వయస్సులో, అతను 2018 టోర్నమెంట్‌లో క్రిస్టియానో రొనాల్డో నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించి, ప్రపంచ కప్ హ్యాట్రిక్ సాధించిన అత్యంత వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. అతను ప్రపంచ కప్‌లో కలిపి చేసిన గోల్స్ మరియు అసిస్ట్‌ల రికార్డును కూడా 24కు (16 గోల్స్, ఎనిమిది అసిస్ట్‌లు) పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా కెప్టెన్ ఇప్పటికే అత్యధిక ప్రపంచ కప్ ప్రదర్శనలు (27), అత్యధిక నిమిషాలు ఆడిన (2,394), అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (12) ,అత్యధిక విజయవంతమైన డ్రిబుల్స్ (125) రికార్డులను కలిగి ఉన్నాడు.
👉అయితే ఆస్ట్రియా జట్టును తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఈసారి ఫిఫాలో ఆస్ట్రియా తమ తొలి మ్యాచ్‌లో జోర్డాన్‌ను 3-1తో మట్టికరిపించింది. అంతేకాదు గత 12 మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 10 విజయాలు, ఒక డ్రా సాధించి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. దీంతో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరముంది.


