
మాంట్రియల్: కెనడా టెన్నిస్ స్టార్ జెనీ బుచార్డ్ తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. మాంట్రియల్ ఓపెన్ టోర్నీ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌కు ముందు సన్నాహక టోర్నీగా నిర్వహించే ‘నేషనల్ బ్యాంక్ ఓపెన్’ త్వరలో మాంట్రియల్‌లో జరుగుతుంది.
‘ప్రతీ దానికి టైమ్ ఉంటుంది. అలాగే నేను నిష్క్రమించే టైమ్ వచ్చింది. ఎక్కడ కెరీర్‌ను మొదలు పెట్టానో అక్కడే టెన్నిస్‌ను ముగించబోతున్నాను’ అని సోషల్ మీడియాలో బుచార్డ్ పోస్ట్ చేసింది. కెరీర్‌లో 299 విజయాలు, 230 పరాజయాల రికార్డును కలిగిన బుచార్డ్ 2023లో కెనడా గెలిచిన బిల్లీ జీన్ కింగ్ కప్‌లో కీలకపాత్ర పోషించింది. 2014లో బుచార్డ్ సూపర్ ఫామ్ చాటుకుంది.
ఆ ఏడాది వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ కెనడా స్టార్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో సెమీఫైనల్ దాకా పోరాడింది. తద్వారా కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌కు ఎగబాకింది. అయితే మరుసటి ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లోనూ క్వార్టర్స్ చేరిన ఆమెకు యూఎస్ ఓపెన్ చేసిన గాయం కెరీర్‌ను దెబ్బతీసింది.
2015లో యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన ఆమె లాకర్ రూమ్ వద్ద జారిపడింది. దీంతో కన్‌కషన్‌కు గురైన ఆమె టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలగింది. దీనిపై యూఎస్ ఓపెన్ నిర్వాహకులపై విమర్శలు వచ్చాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆమె గాయపడిందని జ్యూరీ విచారణలో తేలింది.