వెస్టిండీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌ | England Women Beat West Indies By 17 Runs In 3rd T20I | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌

May 27 2025 4:02 PM | Updated on May 27 2025 4:16 PM

England Women Beat West Indies By 17 Runs In 3rd T20I

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (మే 26) జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రాణించిన హీథర్‌ నైట్‌
స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ హీథర్‌ నైట్‌ అజేయ అర్ద సెంచరీతో (66) రాణించడంతో ఇంగ్లండ్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేయగలిగింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో నాట్‌ సీవర్‌ బ్రంట్‌ 37, ఆమీ జోన్స్‌ 22,అలైస్‌ క్యాప్సీ 4, సోఫియా డంక్లీ 3, ఎమ్‌ ఆర్లాట్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ 3, జైదా జేమ్స్‌, క్లాక్స్ట్‌న్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

హేలీ పోరాటం వృధా
145 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో విండీస్‌ తడబడింది. ఆ జట్టు కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ (71) ఒంటరిపోరాటం​ చేసినా గెలవలేకపోయింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్‌తో పాటు గ్రిమ్మండ్‌ (15), గజ్నబి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లు లారెన్‌ బెల్‌, ఆర్లాట్‌, చార్లోట్‌ డీన్‌, లిన్సే స్మిత్‌ తలో రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను కట్టడి చేశారు.

30 నుంచి ప్రారంభం​
కాగా, మూడు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం విండీస్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌ నిన్నటితో ముగియగా.. మే 30 (డెర్బీ), జూన్‌ 4 (లీసెస్టర్‌), 7 తేదీల్లో (టాంటన్‌) మూడు వన్డేలు జరుగనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement