
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్.. నిన్న (జులై 7) జరిగిన చివరి మ్యాచ్‌లో ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు) సరిపెట్టాడు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితమై.. ఆతర్వాత ఆ స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియా 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ 1,3,4 వన్డేలు గెలువగా.. ఇంగ్లండ్ 2, 5 వన్డేల్లో నెగ్గింది. భారత్ త్వరలో ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్‌లో జరుగనుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్‌ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్‌దే.
రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలుత బెన్ డాకిన్స్ (66), ఆతర్వాత బెన్ మేస్ (82 నాటౌట్), కెప్టెన్ థామస్ రూ (49 నాటౌట్) రాణించి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 2, దిపేశ్ దేవేంద్రన్ ఓ వికెట్ తీశాడు.
శాంతించిన వైభవ్
ఈ సిరీస్‌లో వైభవ్ 100 లోపు స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 130కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.
తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు.
ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్‌ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు. ఐదో వన్డేలో నిదానంగా ఆడినా 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.