‘సర్‌’ అండర్సన్‌ | England cricket legend James Anderson awarded prestigious knighthood | Sakshi
Sakshi News home page

‘సర్‌’ అండర్సన్‌

Apr 12 2025 3:31 AM | Updated on Apr 12 2025 3:31 AM

England cricket legend James Anderson awarded prestigious knighthood

ఇంగ్లండ్‌ దిగ్గజ బౌలర్‌కు ‘నైట్‌హుడ్‌’ పురస్కారం  

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌కు ప్రతిష్టాత్మక ‘నైట్‌హుడ్‌’ అవార్డు లభించింది. ఈ పురస్కార గ్రహీతల పేర్లకు ముందు ‘సర్‌’ జోడిస్తారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన అండర్సన్‌కు... బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషీ సునాక్‌ రాజీనామా గౌరవ జాబితాలో ‘నైట్‌హుడ్‌’ గౌరవం లభించింది. 2002లో ఆ్రస్టేలియాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్‌... రెండు దశాబ్దాలకు పైగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి గతేడాది రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

జిమ్మీ 188 టెస్టుల్లో 704... 194 వన్డేల్లో 269... 19 టి20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌ (800; శ్రీలంక), షేన్‌ వార్న్‌ (708; ఆ్రస్టేలియా) తర్వాత అండర్సన్‌ (704) మూడో స్థానంలో నిలిచాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకారం ఆటకు చేసిన సేవలకు గానూ అండర్సన్‌కు ‘నైట్‌హుడ్‌’ పురస్కారం లభించింది. కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడైన రిషీ సునాక్‌ క్రికెట్‌కు వీరాభిమాని. 

గతేడాది అండర్సన్‌తో పాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్లతో అతడు నెట్స్‌ సెషన్‌లో సైతం పాల్గొని ప్రాక్టీస్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను మాజీ ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జిమ్మీ ప్రస్తుతం కౌంటీల్లో లాంకషైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సంవత్సర కాలం పాటు ఆడనున్నట్లు ఈ ఏడాది జనవరిలో లాంకషైర్‌తో అండర్సన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది అతడికి 25వ ఫస్ట్‌ క్లాస్‌ సీజన్‌ కావడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
Advertisement